Nara Lokesh Padayatra: యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ మరో మైలురాయి దాటేశారు. నేటితో రాయలసీమలో తన యాత్రను పూర్తిచేయనున్నారు. కోస్తాలో అడుగుపెట్టనున్నారు.చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర 124 రోజుల పాటు 44 నియోజవకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర సాగింది. వైసీపీ కి బలమైన ప్రాంతంగా పేరుపడిన రాయలసీమలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కింది మూడు అంటే మూడు సీట్లు. అలాంటి చోట పాదయాత్ర అంటే ఎలా తట్టుకుంటారోనన్న సందేహం టీడీపీ శ్రేణుల్లో ఉండేది. కానీ లోకేష్ దిగ్విజయంగా పాదయాత్రను పూర్తిచేయగలిగారు. తనపై ఉన్న అంచనాలను పటాపంచలు చేశారు. కానీ ఇంకా ఆశించిన స్థాయిలో పరిణితి కనబరచలేకపోతున్నారు.
తనను తాను నాయకుడిగా మలుచుకునేందుకు.. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు నడవడానికి డిసైడయ్యారు. ఇంకా దాదాపు 2500 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంది. తన రాజకీయ వారసుడిగా లోకేష్ కు అన్ని యోగ్యతలు ఉన్నాయని చెప్పేందుకు చంద్రబాబు పాదయాత్రకు ప్లాన్ చేశారు. షెడ్యూల్ ను ప్రకటించిన నాటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. లోకేష్ శరీర ఆకృతిలో కూడా మార్పు వచ్చేలా ప్రత్యేకంగా వర్కవుట్ చేశారు. లోకేష్ ను అన్నివిధాలా సంసిద్ధుడును చేశారు.
తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక రకమైన విభిన్న వాతావరణం ఉండేది. ప్రభుత్వ చర్యలు, వైసీపీ సోషల్ మీడియా వికృత చర్యలతో అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. లోకేష్ ను పలుచన చేసే చర్యలు కనిపించాయి. అయితే వాటన్నింటినీ లోకేష్ అధిగమించగలిగారు. రాను రాను పెరుగుతున్న జన సందోహం.. లోకేష్ నిక్కచ్చి మాటలు… రాజకీయాలపై ఆయన అవగాహన అన్నీ స్పష్టమయ్యే సరికి అందరూ సైలెంట్ అయిపోయారు. తొలిరోజుల్లో టీడీపీ శ్రేణులు భుజాన వేసుకొని పాదయాత్రను సక్సెస్ చేశాయి.
రాయలసీమ ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక ప్రకటించి సీమ ప్రజల్లో లోకేష్ ఆలోచన తెప్పించగలిగారు. సీమ ప్రజలు కూడా లోకేష్ ను నాయకుడిగా గుర్తించడం ప్రారంభించారు. తాను సీమ బిడ్డనేనని చెప్పుకునేందుకు ఏ మాత్రం సంకోచించని లోకేష్.. రాయలసీమ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని ప్రజల ముందు ఉంచారు. గతంలో వైసీపీని ఆదరిస్తే. చేసిందేమీ లేదని.. ఆదరించిన వాళ్లను భక్షించారని.. కానీ అదే స్థాయి మద్దతు టీడీపీకి ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు. ఇందుకు సాక్ష్యంగా తమ హయాంలో రాయలసీమలో జరిగిన అభివృద్ధినే ప్రజల ముందుంచారు. దీంతో లోకేష్ యాత్రపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది.
అసలు లోకేష్ నడవగలడా? అని ఎగతాళి చేశారు. పాదయాత్ర సగంలో నిలిచిపోతుందని ఎద్దేవా చేశారు. అసలు మాట్లాడలేని లోకేష్ ఎలా ముందుకెళతారని ప్రశ్నించిన వారు ఉన్నారు. గతంలో సీఎం జగన్ పాదయాత్ర చేసిన్పుడు వారానికి ఐదు రోజులు నడిచేవారు. రెండు రోజుల పాటు విరామం ఇచ్చేవారు. కానీ లోకేష్ పాదయాత్ర నిరంతరాయంగా జరుగుతోంది. తెల్లవారు జామునే ప్రారంభమయ్యే ఆయన దినచర్య.. అర్థరాత్రి వరకూ ఉంటోంది. అత్యధిక సమయం జనంలోనే ఉంటున్నారు. సక్సెస్ ఫుల్ గా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మైనస్ పాయింట్లను అధిగమించి తనకు తాను ఒక భావి నాయకుడిగా చూపించుకునేందుకు తపన పడుడుతున్నారు.