మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు లోకేశ్ ను నెటిజన్లు చాలా సందర్భాల్లో తెలంగాణ సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ తో పోల్చి కామెంట్లు చేస్తున్నారు. కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు భవిష్యత్తులో సీఎం కావడానికి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నారు. 2004 నుంచి కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసిన కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలని ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి 2004 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే ఆకాంక్షతో 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
స్వతంత్ర అభ్యర్థి మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో గెలిచారు. గతేడాది నుంచి ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. ఇలా కేటీఆర్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు తనదైన శైలిలో జవాబులు ఇస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో లోకేశ్ పరిస్థితి మాత్రం కేటీఆర్ కు పూర్తి భిన్నంగా ఉంది. చాలా సందర్భాల్లో లోకేశ్ ప్రసంగాలు టీడీపీని ఇరుకున పెట్టాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన లోకేశ్ మంగళగిరిలో ఓటమిపాలైన సంగతి విదితమే. లోకేశ్ ట్విట్టర్ ద్వారా అధికార పార్టీపై చేసే విమర్శల గురించి కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బలమైన రాజకీయనేతగా ప్రూవ్ చేసుకోవడంలో లోకేశ్ పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో నెటిజన్లు రాజకీయ నేతగా ఎలా ఎదగాలో లోకేశ్ కేటీఆర్ ను చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.