నారా లోకేష్.. గెలుపు పొందేవరకు అలుపు లేదట!

రాజకీయాల్లో అధికారం అనేదే అల్టిమేటం.. అధికారంలో చేతిలో ఉంటే కొండ మీది కొతి అయినా సరే మనకు బానిస అవుతుంది. ఆ అధికారం కోసమే కదా.. సీఎం జగన్ ఏపీ అంతా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అంతకుముందు చంద్రబాబు సైతం చెమటోడ్చింది. ఎందుకోగానీ పాదయాత్ర చేసిన అందరికీ రాజ్యాధికారం ప్రాప్తించింది. సీఎం సీటును ప్రజలు కానుకగా ఇచ్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ కుదేలైంది. వైసీపీ కొట్టిన దెబ్బకు కోలుకోవడం లేదు. మరోవైపు ప్రత్యర్థులంతా […]

Written By: NARESH, Updated On : August 21, 2020 7:57 pm
Follow us on


రాజకీయాల్లో అధికారం అనేదే అల్టిమేటం.. అధికారంలో చేతిలో ఉంటే కొండ మీది కొతి అయినా సరే మనకు బానిస అవుతుంది. ఆ అధికారం కోసమే కదా.. సీఎం జగన్ ఏపీ అంతా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అంతకుముందు చంద్రబాబు సైతం చెమటోడ్చింది. ఎందుకోగానీ పాదయాత్ర చేసిన అందరికీ రాజ్యాధికారం ప్రాప్తించింది. సీఎం సీటును ప్రజలు కానుకగా ఇచ్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ కుదేలైంది. వైసీపీ కొట్టిన దెబ్బకు కోలుకోవడం లేదు. మరోవైపు ప్రత్యర్థులంతా కాచుకూర్చున్నారు. బీజేపీ అయితే చంద్రబాబును నిర్వీర్యం చేసి టీడీపీని హైజాక్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసింది. పార్టీ మారిన వారంతా అంతా చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ చేశాడంటున్నారు. ఇక లోకేష్ పై నమ్మకం లేదని.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొందరంటున్నారు. ఇక టీడీపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. బాలక్రిష్ణ సినిమాలు వదిలి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని తెలుగుతమ్ముళ్లు కోరుతున్నారు. అందుకే అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలు.. రోజురోజుకు దిగజారిపోతున్న టీడీపీ ప్రతిష్టను కాపాడేందుకు చినబాబు రంగంలోకి దిగబోతున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Also Read: వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?

40ఇయర్స్ పాలిటిక్స్ అయిన చంద్రబాబు పుత్రరత్నానికి బాబులా శక్తి సామర్థ్యాలు నాయకత్వ లక్షణాలు రాలేదని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు.. స్వతహాగా ప్రజల్లోంచి వచ్చిన నాయకులకే అలాంటి లక్షణాలు అబ్బుతాయంటారు. తండ్రిచాటు బిడ్డగా ఎదిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ ఇప్పుడు భావి టీడీపీ నాయకుడిగా నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అయితే లోకేష్ అందరూ వాడిన బ్రహ్మాస్త్రంతో టీడీపీని గద్దెనెక్కించాలని యోచిస్తున్నాడట. కానీ దాన్ని కొద్దిగా మార్చేసి మెరుపు తీగలా ప్రజల ముందుకు వెళ్లడానికి రంగం సిద్ధం చేశారట..

పాదయాత్ర.. తెలుగునేలపై పవర్ ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.

ఇప్పుడు జగన్ పాదయాత్రతో కొల్లగొట్టిన అధికారాన్ని సైకిల్ యాత్రతో టీడీపీని గద్దెనెక్కించాలని నారా లోకేష్ మొదలు పెట్టబోతున్నారట. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన పార్టీకి జవసత్త్వాలు నింపేందుకు.. తన నాయకత్వంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పేందుకు.. నాయకత్వ పటిమను నిరూపించుకునేందుకు ఇప్పుడు లోకేష్ ఎంచుకుంటున్న ఆయుధం సైకిల్ యాత్రేనని టీడీపీలో చర్చ సాగుతోంది. 2022 జనవరి నుంచి లోకేష్ బాబు రాష్ట్రమంతా సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు లోకేష్ సైకిల్ యాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసే పనిలో టీడీపీ ఉందని తెలిసింది.

Also Read: ఫోన్ ట్యాపింగ్: జగన్ సర్కార్ మెడకు ఉచ్చు బిగుస్తోందా?

సొంతంగా ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ బాబు ఇప్పుడు సైకిల్ యాత్రతో టీడీపీ ఇమేజ్ ను ఎంత పెంచుతాడు? ఆయన ఎంత వరకు ఎదిగి టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాడన్నది వేచిచూడాలి. ఎందుకంటే పాదయాత్ర ద్వారా సీఎంలు అయిన చరిత్ర మనం చూశాం. మరి ఈ సైకిల్ యాత్ర ఎంతవరకు పనిచేస్తుందనేది వేచిచూడాలి.