Nara Lokesh: లోకేష్ కన్నీరు కాదు..తెగువ చూపించాల్సిన సమయం

ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు నంద్యాలలో ఉండగా సెప్టెంబర్ 10న అర్ధరాత్రి పోలీసులు ఆయన అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Written By: Dharma, Updated On : October 22, 2023 2:39 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిది అక్రమ అరెస్టు అని.. వ్యవస్థలను మేనేజ్ చేసి 43 రోజులుగా జైల్లో ఉండేలా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీవిస్తృత సమావేశంలో గద్గద స్వరంతో ప్రసంగించారు. తన తండ్రినే కాదు.. తనతో పాటు తల్లి పై సైతం కేసులంటూ బెదిరింపులకు దిగుతున్నారు అంటూ లోకేష్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలతో కలత చెందిన లోకేష్ విసిగివేసారి ఈ ప్రకటనలు చేస్తున్నారని టిడిపి శ్రేణుల్లో బలమైన చర్చ జరుగుతోంది.

ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు నంద్యాలలో ఉండగా సెప్టెంబర్ 10న అర్ధరాత్రి పోలీసులు ఆయన అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటికే గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ వెంటనే రాజమండ్రి కి చేరుకున్నారు. అప్పటినుంచి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత 45 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. తాను సైతం విచారణలు ఎదుర్కొంటున్నారు. అటు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది.

ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు జరుగుతున్న విచారణలను లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులను, కోవిదులను సంప్రదించి ముందుకు సాగుతున్నారు. అయినా సరే ఎక్కడా ఊరట దక్కడం లేదు. సానుకూలతలు కనిపించడం లేదు.మొన్న ఆ మధ్యన బిజెపి అగ్రనేత అమిత్ షా ను కలిశారు. తన బాధను వ్యక్తపరిచారు. న్యాయం వైపు ఉండాలని విజ్ఞప్తి చేశారు. అయినా సరే ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఇప్పట్లో కేసులో తుది తీర్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో లోకేష్ లో ఒక రకమైన నైరాస్యం కనిపిస్తోంది. అందుకే పార్టీ శ్రేణుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

చంద్రబాబు అరెస్టుతో టిడిపి శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. వారికి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది. అటు తండ్రీ కేసుల విచారణలో న్యాయపోరాటం చేస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలి. జనసేనతో పొత్తు అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ సమర్థతకు ఇదో చక్కటి అవకాశం. కానీ ఏ స్థాయిలో కూడా తనలో ఉన్న బాధను, నైరాశ్యాన్ని వ్యక్తం చేస్తే ప్రత్యర్థులకు అదో బలమైన అస్త్రంగా మారుతుంది. అందుకే లోకేష్ వీలైనంతవరకు తెగువను ప్రదర్శించాల్సిన సమయం ఇది అని విశ్లేషకులు సూచిస్తున్నారు.