Nara Lokesh: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వారసుల నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.ముఖ్యంగా చంద్రబాబు, కెసిఆర్ వారసుల విషయంలో పోలిక నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కెసిఆర్ కు గాయం కావడంతో ఆయన సభకు రాలేదు. అయితే ఆయన వారసులుగా వచ్చిన కేటీఆర్, హరీష్ రావులు మాత్రం అధికార పార్టీని గట్టిగానే ఎదుర్కొన్నారు. తమ వాయిస్ ను బలంగా వినిపించారు. ముఖ్యంగా కేటీఆర్ కౌంటర్ అటాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే చంద్రబాబు సైతం గత ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఎమ్మెల్సీగా ఆయన వారసుడు లోకేష్ కొనసాగారు. కానీ ఈనాడు ఈ స్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇవ్వలేకపోయారు అన్న విమర్శ ఉంది. మొన్న చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా.. కేవలం కేసుల పర్యవేక్షణకి లోకేష్ పరిమితమయ్యారు. ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావులు అసెంబ్లీలో సమర్థవంతంగా అధికార పార్టీని ఎదుర్కోవడంతో ఏపీలో లోకేష్ డొల్లతనంపై చర్చ నడుస్తోంది. లోకేష్ ఏనాడు శాసనమండలిలో అధికార పార్టీని ఈ స్థాయిలో ఇరుకున పెట్టలేకపోయారని టాక్ నడుస్తోంది.
అనారోగ్య కారణాలతో కేసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, గవర్నర్ ప్రసంగం తర్వాత శనివారం సీరియస్ గా సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాడి వేడిగా సభలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ కోట కింద కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి దెప్పి పొడిచారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తమరిది పేమెంట్ సీట్ అని.. ఢిల్లీ వెళ్లి పేమెంట్ కట్టిపొందిన విషయాన్ని గట్టిగానే చెప్పారు. గత పది ఏళ్ల కెసిఆర్ పాలన పై సీఎం రేవంత్, మంత్రులు విమర్శలు సంధించినప్పుడు.. కేటీఆర్ గట్టిగానే తిప్పికొట్టారు. అటు హరీష్ రావు సైతం పదునైన మాటలతో ఎదురు దాడి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే సభలో కెసిఆర్ లేని లోటును ఆ ఇద్దరు వారసులు తీర్చారు.
లోకేష్ విషయంలో ఆ పరిస్థితి ఉందా అంటే.. తప్పకుండా లేదనే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో కెసిఆర్ కు వారసులుగా కేటీఆర్, హరీష్ రావు లో ఉన్నారు. వారి మధ్య పోటీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఏపీలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ సోలో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. తనకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసినా.. లోకేష్ ఎమ్మెల్సీగా కొనసాగారు. ఆ సమయంలో అధికార వైసిపి పై ఎదురు దాడి చేసే అవకాశం ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేకపోయారన్న విమర్శ ఉంది. మొన్నటికి మొన్న చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలను సైతం తనకు అనుకూలంగా మలుచుకోలేకపోయారన్న కామెంట్స్ వినిపించాయి. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమ వాయిస్ ను బలంగా వినిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ లోకేష్ మాత్రం ఎందుకో అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ చూపుతున్న తెగువ కారణంగా.. లోకేష్ తేలిపోతుండడం విశేషం. ఇప్పటికైనా రాజకీయాల విషయంలో లోకేష్ పరిపక్వత సాధించాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి.