Nara Brahmani Padayatra: తెలుగుదేశం పార్టీ భారీ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా అంతా చంద్రబాబు చూసుకునేవారు. అటువంటి చంద్రబాబు దాదాపు మూడు వారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా మారిపోయారు. మరోవైపు లోకేష్ ను సైతం అరెస్టు చేస్తారన్న ప్రచారం సాగుతోంది. తన తండ్రి అక్రమ అరెస్టును ఖండిస్తూ జాతీయస్థాయిలో లోకేష్ పోరాటం చేశారు. పది రోజులుగా ఢిల్లీలో ఉండి పోయారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం సైతం అందజేశారు. కేంద్ర పెద్దలను సైతం కలుస్తారని ప్రచారం జరిగినా.. అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే అరెస్టుకు భయపడే లోకేష్ ఢిల్లీలో ఉండిపోయారని అధికార వైసీపీ నేతలు చేస్తున్నారు. ఈ తరుణంలో లోకేష్ ఏపీ చేరుకోనున్నారు. దీంతో ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. ఆగిన చోట నుంచి శుక్రవారం రాత్రి యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు. మరోవైపు తనను అరెస్టు చేస్తారన్న కారణంతో.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దాఖలు చేసుకున్నారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినా తన యువగళం పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే పరిస్థితి చూస్తే మాత్రం ఆయన అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగాలని డిసైడ్ అయ్యింది.
ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. అటు నారా భువనేశ్వరి నేరుగా ప్రజల మధ్యకు రావడంతో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు యాక్టివ్ అవుతున్నాయి. అటు బ్రాహ్మణి సైతం కొద్దిరోజుల పాటు వ్యాపార కార్యకలాపాలు విడిచి రాజకీయాల్లో పాలుపంచుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఒకవేళ లోకేష్ ను పోలీసులు అరెస్టు చేస్తే.. బ్రాహ్మణి పాదయాత్రకు సిద్ధం కానున్నారు. తన భర్త చేపట్టాల్సిన 1000 కిలోమీటర్ల పాదయాత్రను బ్రాహ్మణి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 2800 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. మిగతా షెడ్యూల్ బ్రాహ్మణి పూర్తి చేయనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆమెను అన్ని విధాలా సిద్ధం చేసినట్లు సమాచారం.
బ్రాహ్మణి అయితే అటు నారా, ఇటు నందమూరి కుటుంబ సభ్యురాలిగా జనం ముందు వెళ్తే బ్రాహ్మ రథం పడతారని టిడిపి నాయకత్వం భావిస్తోంది. మరోవైపు భువనేశ్వరితో రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు పెడితే ప్రజల నుంచి విశేష ఆదరణ ఖాయమని భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుతో పాటు కుమారుడు లోకేష్ ను జగన్ అక్రమంగా అరెస్టు చేయించారని ఊరువాడా ప్రచారం చేయిస్తే వైసీపీ సర్కార్కు గట్టి జలక్ తగులుతుందని టిడిపి సీనియర్లు భావిస్తున్నారు. అయితే నారా లోకేష్ పాదయాత్రను అక్టోబర్ 3 వరకు వాయిదా వేయాలని కొంతమంది టీడీపీ నాయకులు కోరుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబర్ 3న విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుకు తప్పకుండా అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయకోవిదులు భావిస్తున్నారు. అటు తరువాతే యువగళం పాదయాత్రను ప్రారంభిస్తే మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఏ పరిస్థితి ఉన్నా నారా బ్రాహ్మణి పాదయాత్రకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉండడం విశేషం.