Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి.. పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి. ఇలా ఎలా చూసుకున్నా ఏపీ ప్రజలకు ఆమె సుపరిచితురాలే. అయితే ఎన్నడూ ఆమె రాజకీయ వేదికలు పంచుకోలేదు. ఒక్క భర్త చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాడు మాత్రం ఆయన వెంట కనిపించేవారు. అయితే ఇన్ని రోజులు భర్త చాటు భార్యగా ఉన్న భువనేశ్వరి తన వ్యాపారాలేవో తాను చూసుకున్నారు. కానీ భర్త జైలు పాలు కావడంతో ఆమె బయటకు వచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి అన్యాయాన్ని ఎండ గడుతున్నారు. అయితే భర్త కోసం ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జయంతి నాడు ఒకరోజు దీక్ష చేపట్టాలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు కాబడి దాదాపు 23 రోజులు కావస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా మూడు వారాల పాటు ఉన్నారు. అప్పటినుంచి భువనేశ్వరి తో పాటు కోడలు బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటున్నారు. భర్త యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జైలు నిబంధనల మేరకు మూలాఖత్ లో భర్తను కలుస్తూ వస్తున్నారు. మరోవైపు భర్త అరెస్ట్ కు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు టిడిపి శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మనోధైర్యంతో కనిపిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో సైతం ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె తెగువును చూసి టిడిపి సీనియర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి నారా భువనేశ్వరి రాజకీయ వేదికలను పంచుకోవడం చాలా అరుదు. 2014 టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం.. భువనేశ్వరి ఎక్కడ కనిపించేవారు కాదు. హెరిటేజ్ వ్యవహారాల్లో బిజీగా ఉండేవారు. బ్రాహ్మణి రాక మునుపు ఆమె హెరిటేజ్ వ్యవహారాలను చూసుకునేవారు. బ్రాహ్మణి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలకు పరిమితమయ్యారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. భువనేశ్వరిని టార్గెట్ చేసుకొని వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కూడా ఆమె పెద్దగా స్పందించలేదు. తాను ఏమిటో తన మనస్సాక్షికి తెలుసునని.. ఎవరికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
అయితే తాజాగా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మాత్రం భువనేశ్వరి బయటకు వచ్చారు. తన భర్తను అకారణంగా అరెస్టు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు మీడియాతో పాటు ఇటు పార్టీ శ్రేణుల సమావేశంలో సైతం గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. దీటుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయించాలని టిడిపి సీనియర్లు భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందుగానే ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ఆమె నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అధికారికంగా ప్రకటించారు.