Nara Bhuvaneshwari and Brahmani : ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రివేంజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయగా.. లోకేష్ ను సైతం త్వరలో అరెస్టు చేస్తామని సిఐడి చీఫ్ ప్రకటించారు. దీంతో ఎన్నికల ముంగిట చిత్ర విచిత్రాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపించే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో టిడిపిలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణీలు వెళ్తే సత్ఫలితాలు వస్తాయని టిడిపి వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.చంద్రబాబు, లోకేష్ లను కేసులతో హింసిస్తుండడంతో మహిళలతో ప్రచారం చేయిస్తే సానుభూతి లభిస్తుందని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఆ కుటుంబం విభేదించింది. ఈ క్రమంలో జగన్ పై కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతి జగన్ కు అండగా నిలబడ్డారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. తన భర్త కృషితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని.. అటువంటి పార్టీయే తన కుమారుడిపై కక్ష కట్టిందని.. కుటుంబాన్ని వీధిన పడేసిందని విజయమ్మ ప్రజల వద్ద కన్నీటి పర్యంతం కావడం అప్పట్లో సంచలనం రేపింది. కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బతీసింది. అటు షర్మిల సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. అటు జగన్ భార్య భారతి సైతం నేరుగా ప్రజలను కలుసుకొని.. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని వివరించగలిగారు. అప్పట్లో వైయస్ కుటుంబంలోని మహిళలు నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావడంతో సానుభూతి వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడు చంద్రబాబు కుటుంబం విషయంలో జరుగుతున్న కేసుల దాడితో టిడిపి పెద్దల సైతం… భువనేశ్వరి, బ్రాహ్మణిలతో ప్రచారం చేయిస్తే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు లోకేషులపై వేధింపులు పాల్పడుతున్నారని.. తప్పుడు కేసులో వేధిస్తున్నారని.. న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అటు బుద్దా వెంకన్న లాంటి నాయకులు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు బయటకు వస్తే ఆ ప్రజాదరణను తట్టుకోలేరని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇది మామూలుగా చేసిన వ్యాఖ్యలు కాదని.. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఓ కార్యచరణ సిద్ధమైందన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
వచ్చే ఎన్నికలు ఆషామాషీగా జరిగే అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో చంద్రబాబును ఒంటరి చేసి దెబ్బ కొట్టారు. ఈ పరిణామం దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు అండగా నిలవాలని నందమూరి కుటుంబ సభ్యులతో పాటు భువనేశ్వరి, బ్రాహ్మణి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే ఫలితాలు పూర్తిస్థాయిలో ఏకపక్షమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఎప్పటికీ జగన్ తనకోసం ఎంతో కృషిచేసిన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను దూరం చేసుకున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు, లోకేష్ లకు అండగా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే మాత్రం మంచి ఫలితాలు రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.