Nara Bhuvaneshwari- Brahmani: తెలుగుదేశం పార్టీ అసలు సిసలు రాజకీయానికి తెరతీసిందా? చంద్రబాబు అరెస్టుతో కుటుంబమంతా కలిసి రానుందా? పార్టీలో భువనేశ్వరి, నారా బ్రాహ్మణి యాక్టివ్ కానున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తనపై ముప్పేట ఎదురవుతున్న కేసుల నేపథ్యంలో కుటుంబ సభ్యుల సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్న ములాఖత్ లో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణీలు చంద్రబాబును కలిశారు. కీలక విషయాలపై చర్చించారు. వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రంగంలోకి నందమూరి బాలకృష్ణ దిగారు. వైసీపీ సర్కార్ కు అల్టిమేటమ్ ఇచ్చారు. సీఎం జగన్ పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. మరోవైపు ఈరోజు టిడిపి కీలక నేతల సమావేశానికి భువనేశ్వరి, బ్రాహ్మణి హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తీరుతెన్నులను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు పార్టీ శ్రేణులతో సమావేశమైనట్లు టాక్ నడుస్తోంది.ఒకవేళ చంద్రబాబుకు బెయిల్ వచ్చినా.. భువనేశ్వరి, బ్రాహ్మణి సేవలను పార్టీ వినియోగించుకోనున్నట్లు సమాచారం.
అవసరమైతే బ్రాహ్మణితో యువ గళం పాదయాత్ర కొనసాగించడానికి చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా విరమించిన సంగతి తెలిసిందే. ఇటు కేసులు, అటు పార్టీ వ్యవహారాల్లో లోకేష్ బిజీగా మారిన తరుణంలో.. ఇంకా మిగిలిన వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను బ్రాహ్మణితో చేయించడానికి కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. మరోవైపు భువనేశ్వరి సైతం ప్రజల బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ తమ కుటుంబాన్ని టార్గెట్ చేయడాన్ని ఆమె నేరుగా ప్రజలకు వివరించే అవకాశం ఉంది.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ జరిగిన తర్వాత.. 20 మంది వరకు మనస్థాపంతో ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. వారి కుటుంబాలను భరోసా కల్పించడానికి చంద్రబాబు యాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అటు బాలకృష్ణ సైతం పెండింగ్ సినిమాలను పూర్తి చేసి.. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారని సమాచారం. మొత్తానికైతే చంద్రబాబు అరెస్ట్ తర్వాత కుటుంబమంతా యాక్టివ్ కావడం విశేషం.