NTR Statue: ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మొన్నటివరకు అమరావతి రైతుల ఉద్యమం, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు విత్ డ్రా తర్వాత ఉత్తరాంధ్రుల ఉద్యమం అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి ఘాటు వ్యాఖ్యలు చేయడం అతని ఇంటిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన అంశం సంచలనం సృష్టించింది.
ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు ఫ్యామిలీని వైసీపీ ఎమ్మెల్యేలు దూషించడంతో మీడియా పాయింట్ వద్ద బాబు కన్నీళ్లు పెట్టుకోవడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం గూండా రాజకీయాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
Also Read: ఎన్టీఆర్ ఆ 3 బ్లాక్ బస్టర్లు అక్కడ అతి పెద్ద డిజాస్టర్లు.. కారణమిదే !
రాష్ట్రంలో తాజాగా గుర్తుతెలియని దుండగులు ఎన్టీయార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఈ ఘటన చోటుచేసుకోగా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధ్వంసానికి పాల్పడింది వైసీపీ నేతలే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పలు చోట్ల టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి గురైన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
అయితే, ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై నందమూరి రామకృష్ణ స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజలు దేవుడిగా ఆరాధించే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే యావత్ తెలుగు జాతిని అవమానించినట్టేనని వెల్లడించారు. తాము కూడా ఎన్టీఆర్ అభిమానులం అని చెప్పుకునే వైసీపీ నేతలు ఈ దాడిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎవరైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నందమూరి రామకృష్ణ డిమాండ్ చేశారు.