Minister Roja: వైసీపీలో మంత్రి ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ఆమెకు ఆమే సాటి. నిర్వర్తిస్తున్న శాఖ కంటే.. రాజకీయ విమర్శలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అటువంటి ఆమె సొంత పార్టీలో మాత్రం తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. నగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆమెకు వ్యతిరేకంగా ప్రత్యేక వర్గాలే నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ డౌటే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో నగిరి నియోజకవర్గంలో సోమవారం జగన్ పర్యటించనున్నారు. విద్యా దీవెన పథకానికి బటన్ నొక్కనున్నారు.
అయితే ఇటీవల వైసిపి అభ్యర్థుల ప్రకటనను వేగవంతం చేసింది. సీఎం జగన్ జిల్లాల పర్యటనకు వెళుతున్నప్పుడు చాలామంది అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు రీజనల్ కోఆర్డినేటర్లు సైతం అభ్యర్థులను నేరుగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ నగిరి పర్యటనకు వెళ్తుండడంతో రోజా అభ్యర్థిత్వం విషయంలో క్లారిటీ ఇస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి రోజాకు టిడిపి కంటే సొంత పార్టీ నేతలతోనే రాజకీయ ప్రమాదం పొంచి ఉంది. నియోజకవర్గంలో ప్రతి మండలంలో రోజాకు వ్యతిరేకంగా ఒక నాయకుడు పనిచేస్తున్నాడు. వీరందరికీ జిల్లా సీనియర్ మంత్రి అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రోజా మంత్రిగా ఉన్నారు. ఆమె మాటే చెల్లుబాటు కావాలి. కానీ రోజాను వ్యతిరేకిస్తున్న వారికే పనుల్లో అగ్ర పీఠం చేస్తున్నారు. పదవులు కట్టబెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోజాని వ్యతిరేకిస్తే చాలు.. వారి పనులు చకచకా జరిగిపోతున్నాయి. రోజా వ్యతిరేక వర్గీయులను ఆర్థికంగా బలోపేతం చేయడం వెనుక ఆమెను ఓడించే పధక రచన సాగుతోంది. నగిరిలో తనకు వ్యతిరేకంగా రాజకీయాలు సాగుతున్న తీరుపై ఇప్పటికే పలుమార్లు రోజా సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది. పైగా రోజాను వ్యతిరేకిస్తున్న నేతలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు పుష్కలంగా అందుతున్నాయి.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో నగిరి నియోజకవర్గంలో కొత్త నేత తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతోంది. రోజాకు టిక్కెట్ ఇస్తే ఓటమి ఖాయమని ఐప్యాక్ నివేదికలో తేలినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ సైతం రోజా విషయంలో సైలెంట్ గా ఉన్నారు. రాయలసీమ బాధ్యతలు చూస్తున్న సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి ఓ బీసీ నేతను తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయన సిఫారసులకు జగన్ పెద్దపీట వేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో జగన్ నగిరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రోజా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారో? లేకుంటే అసమ్మతి నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారో? అన్నది చూడాల్సి ఉంది.