Janasena Yuvashakti- Nagababu: మెగా బ్రదర్ నాగబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో అధికార వైసీపీ దురాగతాలను ఎండగట్టారు. నాటి నుంచి నేటి వరకూ నియంత పాలనలను గుర్తుకు తెస్తూ జగన్ సర్కారుపై పదునైనా విమర్శనాస్త్రాలు సంధించారు. జనసేనలో నాగబాబుది యాక్టివ్ రోల్. పార్టీ విధానాలపై గట్టిగానే మాట్లాడతారు. సోదరుడు, జనసేన అధినేత పవన్ కు అండగా నిలబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో పవన్ పై ఎటువంటి విమర్శలు ఎదురైనా దానికి దీటుగా కౌంటర్ ఇస్తుంటారు. ఇప్పుడు యువశక్తి వేదికగా జగన్ సర్కారుకు గట్టి సంకేతాలే ఇచ్చారు. ప్రజాగ్రహానికి గురై ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని.. ఇప్పుడు జగన్ కూడా అలానే కొట్టుకుపోతారని కూడా హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమం వాడీవేడిగా సాగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఏడు గంటల వరకూ కొనసాగనుంది. నాగబాబు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ పదునైన మాటలతో వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రజలను కేవలం ఓటు వేసే సాధనంగా మార్చేశారని నాగబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడున్నరేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వాన్ని తూలనాడారు. ఇసుకను అమ్మినా, గనులను కొల్లగొట్టినా, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయించినా.. కబ్జా చేసినా, కేసులు పెట్టినా ఇదేమని ప్రశ్నించకూడదన్నది జగన్ సర్కారు నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారని.. దళితులను గుండుకొట్టి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. దళితులను లాఠీలతో చావగొట్టి.. తిరిగి అదే దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నారని.. ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ప్రశ్నించారు.
తన్నులు తిన్నవాడు భరించాలే తప్ప ప్రశ్నించకూడదన్నది జగన్ నైజమని నాగబాబు చెప్పుకొచ్చారు. వ్యవస్థలు, ప్రజలు తాను చెప్పినట్టు నడుచుకోవాలన్నదే జగన్ సిద్ధాంతమన్నారు. రాజకీయ ప్రత్యర్థులను, విపక్ష నేతలను చితక్కొట్టడమే ఆయన రాజనీతిగా అభివర్ణించారు. ఈ మూడున్నరేళ్లలో రాజకీయ వికృత క్రీడను గమనించే పవన్ రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారని చెప్పారు. దానిని అడ్డుకోవడానికే ఎప్పుడో బ్రిటీష్ కాలం నాడు భారతీయులపై విదేశీయులు ప్రయోగించిన జీవో 1ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అది ముమ్మాటికీ పవన్ వారాహి రథయాత్రను అడ్డుకునేందుకేనన్నారు. అయితే అది పాదయాత్రలు, రథయాత్రలు అడ్డుకోవడం కాదని.. ప్రజల గొంతును నొక్కడమేనన్న విషయం జగన్ తెలుసుకోవాలన్నారు. నాడు ఈ జీవోకు భయపడి ఉంటే స్వాతంత్రం వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. నాటి బ్రిటీష్ పాలకుల జీవోలకు ఎదురొడ్డి ఎంతోమంది స్వాతంత్ర యోధులు పోరాటం చేశారని.. వారి స్ఫూర్తితో ప్రజలు వీధుల్లోకి వచ్చి కేక వేస్తే జగన్ సర్కారు పలాయనం చిత్తగిస్తుందన్నారు.
జగన్ చదువుకోలేదు కాబట్టి మంచి చట్టాలు తేలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మంచి మాటను కూడా వినలేని స్థితిలో, అధికార మదంతో ఊగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇటువంటి చట్టాలు తెచ్చి ప్రజల్లో అబాసుపాలవుతున్నారన్నారు. ప్రజలు బానిసలు కాదు పౌరులన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు.పౌర హక్కులకు భంగం కలిగించి ఏ వ్యవస్థను, ప్రభుత్వాన్ని లెక్క చేయాల్సిన పనిలేదన్నారు. ప్రజలు బయటకు వచ్చి పిక్కటిల్లేలా అరిస్తే.. ఆ భయానికే జగన్ సర్కారు కొట్టుకుపోతుందని ఆగ్రహంగా మాట్లాడారు. ప్రభుత్వాలు దిగి వచ్చేలా పోరాటం చేయాలని.. అందుకు మన రాష్ట్రంలో న్యాయస్థానాలే అండగా నిలుస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. దాదాపు 40 నిమిషాలు మాట్తాడిన నాగబాబు అడుగడుగునా జగన్ ప్రభుత్వ చర్యలను గుర్తుచేస్తూ పదునైనా కామెంట్స్ తో దూసుకుపోయారు.
వ్యవస్థలన్నా.. వ్యవస్థలో భాగమైన ప్రజలన్నా పవన్ కు గౌరవమన్నారు. ఆ గౌరవంతోనే విశాఖలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంయమనంతో వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేశారు. రెండు రోజుల పాటు హోటల్ గదికే పరిమితమయ్యారని.. నాడు పోలీసులు ఇచ్చిన నోటీసులను గౌరవించి మౌనాన్నే ఆశ్రయించారని.. తనకు తాను బంధీగా మారారన్నారు. నాడు ఎరుపెక్కిన కళ్లతో తన కళ్లెదుట నిలబడిన యువతను తన నిగ్రహంతో నియంత్రించారే తప్ప రెచ్చగొట్టలేదన్నారు. స్వార్థం తెలియని నాయకుడు పవన్ అన్నారు. అటువంటి నాయకుడి కింద పనిచేయడం గర్వంగా ఉందన్నారు. జనాల ధన, మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైసీపీని సాగనంపాలని నాగబాబు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని వణికించి, ఇబ్బందిపెట్టిన నియంతల చెంతకు జగన్ ను పంపిద్దామని కూడా వ్యాఖ్యానించారు. కాగా నాగబాబు ఎమోషనల్ స్పీచ్ కు సభీకుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. జన సైనికులను ఆలోచింపజేశాయి.