
గాంధీని హత్య చేసిన గాడ్సే, కరెన్సీ నోట్లపై స్వతంత్ర సంయోధుల ఫోటోలపై ఆసక్తికర వ్యాఖ్యల చేస్తూ.. ఇటీవల వరుస ట్వీట్లతో వివాదాలకు తెరతీస్తున్న నాగబాబు అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగబాబు చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, జనసేన పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. ‘జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో కూడా ఈ విషయం చెప్పాం. మరోసారి కూడా చెబుతున్నాం. నాగబాబు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి. వాటికి, పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు.
పార్టీ నిర్ణయాలు, అభిప్రాయాలు అధికార పత్రం, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం. వాటినే పరిగణనలోకి తీసుకోవాలి.’ అని పవన్ కళ్యాణ్ సంతకంతో జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజాసేవ గురించి ఆలోచించాలని, మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.