Nagababu జనసేన కీలక నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు విశేష స్పందన లభిస్తోంది. గత కొంతకాలంగా ఆయన జనసేన పార్టీలో కీ రోల్ పాత్ర పోషిస్తున్న తెలిసిందే. అటు మెగా అభిమానులతో వరుస సమావేశమైన నాగబాబు వారిని సమన్వయం చేసే బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. శ్రీకాకుళం జిల్లా నుంచే తన పర్యటనలు మొదలు పెట్టారు. బుధవారం ఆయన పర్యటన ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకుగాను.. ఉదయం అయిదు.. సాయంత్రం అయిదు నియోజకవర్గాలపై సమీక్షించారు. నియోజకవర్గ, జిల్లా బాధ్యులతో పాటు కీలక నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా కులంకుషంగా అన్ని అంశాలపై చర్చించారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అండగా నిలబెడింది ఎవరు? ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం ప్రాబల్యముంటుంది? గత ఎన్నికల్లో జనసేనకు పడిన ఓట్లు ఎన్ని? ఈ సారి పెరిగిన బలమెంత? మెగా అభిమానుల ప్రభావం ఉంటుందా? అన్న వివరాలను సమగ్రంగా సేకరించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కీలక నాయకులు జనసేన వైపు చూస్తున్నారా అంటూ ఆరా తీశారు.
Nagababu srikakulam Tour
-పీఆర్పీ నేతలపై ఆరా..
ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకుల వివరాలను సేకరించారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్మోహనరావు, పాలవలస కరుణాకర్ వంటి నేతలు ఏ పార్టీలో ఉన్నారు అన్నది కూడా ఆరా తీశారు. మరోవైపు రాజకీయ నేపథ్యమున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు, గౌతు లచ్చన్న, మజ్జి తులసీదాస్ రాజకీయ వారసుల ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్న మత్స్యకారుల జనాభా, వారి స్థితిగతులను కూడా నాగబాబు తెలుసుకున్నారు. ఇప్పటికే మత్స్యకార భరోసా సమావేశం నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి క్రుషిచేసిన విషయాన్ని నాగబాబు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మత్స్యకారుల పూర్తి మద్దతు పొందాలంటే వారికి ఎలా దగ్గరవ్వాలి? వారి సమస్యల పరిష్కారం ద్వారా చేరువ ఎలా కావాలి? అన్నదానిపై నేతలతో నాగబాబు చర్చించారు. జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలసతో పాటు విజయనగరం జిల్లాలో చేరిన రాజాం, పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన పాలకొండ నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి.
-అభిప్రాయ సేకరణ..
మొత్తానికి తొలిరోజు నాగబాబు పర్యటన దిగ్విజయంగా ముగియడంపై జనసేన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భవించిన ఎనిమిదేళ్ల తరువాత వాస్తవానికి దగ్గరగా ఉన్న వివరాలు సేకరించారని చెబుతున్నారు. అందునా మెగా బ్రదర్ నాగబాబు నేరుగా వచ్చి వివరాలు సేకరించడం, వాస్తవాలను నిర్భయంగా చెప్పాలని కోరడంతో.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని వివరించామని జనసైనికులు చెబుతున్నారు. ఇప్పటివరకూ పార్టీ కీలక నేతల పర్యటనలు ప్రజా సమస్యలపైనే సాగేవని.. మొదటిసారి పార్టీ కేడర్ ను సమన్వయం చేసుకునేందుకు నేరుగా నాగబాబు రావడంపై జనసేనలో జోష్ నెలకొంది. పార్టీ ఆవిర్భవించిన ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నామని.. ఒక విదంగా చెప్పాలంటే అధినేత చెప్పినట్టు మానసిక అత్యాచారాలకు గురయ్యామని నాగబాబుకు వివరించామని కూడా జనసేన కార్యకర్తలు, నేతలు చెబుతున్నారు. బూత్ లెవల్, గ్రామస్థాయిలో మరింత బలోపేతం కావడానికి కమిటీలు వేయాలని చాలా మంది నాగబాబుకు సూచించారు. వీటన్నింటినీ కులంకుషంగా విన్న నాగబాబు పార్టీ అధినేతకు నివేదిస్తానని చెప్పారు. మొత్తానికి నాగబాబు ఉత్తరాంధ్ర తొలిరోజు పర్యటనతో జన సైనికుల్లో జోష్ నింపింది. కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చింది.