Nagababu: జనసేనలో మెగా కాంపౌండ్ వాల్ నుంచి నాగబాబు ఒక్కరే యాక్టివ్ గా ఉన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి సోదరుడు పవన్ కు అండదండగా నిలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీచేశారు. తొలిసారిగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో ఓటమి చవిచూశారు. కానీ రెండున్నర లక్షల ఓట్లను సొంతం చేసుకున్నారు. ఓటమి తరువాత కొద్దికాలం పొలిటికల్ గా సైలెంట్ అయినా.. ఇటీవల తిరిగి జనసేనలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా పవన్ ఉండగా… ఆ తరువాత యాక్టివ్ రోల్ మాత్రం నాదేండ్ల మనోహర్, నాగబాబులదే. అయితే ఈసారి పార్టీ సేవకే పరిమితమవుతానని.. పోటీచేసే ఉద్దేశ్యం లేదని చాలా రోజుల కిందట నాగబాబు ప్రకటించారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

ఈసారి ఎన్నికలు అన్నిపార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. అందుకే అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. గతం కంటే జనసేన గ్రాఫ్ పెరిగిందని తెలియడంతో ఏపీ పొలిటిక్స్ అంతా ఆ పార్టీపై ఫోకస్ అయి ఉంది. అందుకే అటు పవన్ కూడా అచీతూచీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. పొత్తుకు సంకేతిస్తూనే. మరోవైపు సొంతంగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను ఎంపీలుగా బరిలో దించేందుకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టిపెట్టారు. కాకినాడ పార్లమెంట్ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజును పోటీలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు నాగబాబును సైతం మరోసారి నరసాపురం నుంచి బరిలో దింపేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు. అదే సమయంలో తాను కూడా ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయ్యాలని భావిస్తున్నారు. తద్వారా ఆ రెండు జిల్లాల్లో స్వీప్ చేయాలన్న కసితో ప్రయత్నిస్తున్నారు.

అటు వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని జనసేన భావిస్తోంది. అప్పుడు ఎంపీలను సమన్వయం చేసుకునే బాధ్యత కీలకం. అటువంటి సమయంలో నాగబాబు ఉంటేనే రాజకీయంగా తనకు ఇబ్బంది ఉండదని పవన్ భావిస్తున్నారు. అటు వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకుంటే జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవచ్చన్న భావనలో పవన్ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీలు అవసరమని భావిస్తున్నారు. ఒక వేళ టీడీపీతో పొత్తు ఉన్నా వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలను కోరనున్నట్టు సమాచారం. అందులో భాగంగానే నాగబాబు మనసు మార్చుకున్నారు. పైగా నరసాపురం సిట్టింగ్ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ లో వైసీపీకి అక్కడ గట్టి దెబ్బే తగిలింది. తాము గెలిపించుకున్న ఎంపీని నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా వైసీపీ చేసిన ప్రయత్నాలపై నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అటు జనసేన గ్రాఫ్ పెరగడం, అటు టీడీపీతో పొత్తు ఖాయమైతే.. ఇక్కడ జనసేనకు సునాయాస విజయం ఖాయం. అందుకే ఈసారి అక్కడ నుంచి పోటీచేసి లోక్ సభలో అడుగు పెట్టాలని నాగబాబు భావిస్తున్నారుట.