Nagababu- TDP: ఏపీలో జనసేన పట్టుబిగుస్తోంది. ఆ పార్టీ లేనిదే వచ్చే ప్రభుత్వం ఏర్పాటుకాదని సామాన్యుడి విశ్లేషించే దాకా వచ్చింది పరిస్థితి. వైసీపీ ఓటమికి, ఘోర పరాజయానికి మధ్య జనసేన ఉంటుందన్నది ఏపీలో మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఎన్నికల్లో పవనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని ఎక్కువ మంది బలంగా నమ్ముతున్నారు. తాజా పరిణామాలు కూడా వాటిని నిజం చేస్తున్నాయి. విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాదు వైసీపీ సర్కారే అడ్డుకుంది. దీంతో విజయవాడ చేరుకున్న పవన్ కు చంద్రబాబు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు స్థాయి వ్యక్తి ఫోన్ పరామర్శతో సరిపెట్టుకుంటే సరిపోయేది. కానీ ఇటువంటి సిట్యువేషన్ కోసమే ఎదురుచూస్తున్న బాబు.. ఎదురెళ్లి మరీ పవన్ ను పరామర్శించారు.. అయితే దీనిని తప్పుపట్టలేం కానీ.. చంద్రబాబుకు పవన్ అవసరముంది కనుకే ఒక మెట్టు దిగి వచ్చారన్న టాక్ నడుస్తోంది. అంటే పవన్ కు పెరిగిన గ్రాఫ్ ఇప్పుడు చంద్రబాబుకు అవసరమని తెలుస్తుందన్న మాట.

పవన్ ఏపీ సర్కారుపై పోరాడుతున్న తీరు… వైసీపీ నేతలకు ఇస్తున్న కౌంటర్ తో పొలిటికల్ స్ట్రాటజీయే మారిపోతోంది. సంతోషించిన వారూ ఉన్నారు. ధ్వేషిస్తున్న వారూ ఉన్నారు. ఇన్నాళ్లూ ఏంచేయలేని నిస్సహాయంగా గడుపుతున్న చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు పవన్ ఇప్పుడు ఓ ఆశాదీపంగా మారిపోయారు. అందుకే పవన్ రియాక్షన్ జనసేన కంటే టీడీపీలోనే జోష్ నింపుతుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే నియంత పాలనలో మగ్గిపోతున్న ప్రజలు మాదిరిగా ఇప్పడు టీడీపీ శ్రేణులు తమ అధినేత చంద్రబాబు కంటే పవన్ వైపే బేలచూపులు చూస్తున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అయితే టీడీపీకి కులాభిమానం అధికం. అవసరం వరకూ ఒక ఎత్తు.. అవసరం తీరాక మరో ఎత్తు అన్నట్టు చంద్రబాబు వ్యవహార శైలి ఉంటుంది. గతంలోనూ కూడా ఇది ప్రస్పుటమైంది. అన్ననే గెలిపించుకోలేని నువ్వు మమ్మల్ని గెలిపించావంటే నమ్మమంటావా అని కొందరు టీడీపీ నాయకులు పవన్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవే నోళ్లు పవన్ ప్రాపకం కోసం స్వాతిముత్యం మాటలు ఆడుతున్నాయి. అందుకే టీడీపీ అనే సరికి జనసేన హార్ట్ కోర్ ఫ్యాన్స్ డిఫెన్స్ లో పడిపోతున్నాయి. టీడీపీతో వెళ్లడం వారికి ఇష్టం లేకున్నా వైసీపీని ఎదుర్కొవాలంటే టీడీపీ కంటే ప్రత్యామ్నాయం ఇప్పుడు కనిపించకపోవడంతో సైలెంట్ అవుతున్నారు. లేకుంటే అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి.

ఈ మధ్యన జనసేనలో నాగబాబు యాక్టివ్ అయ్యారు. పవన్ అధినేతగా ఉండగా.. అన్ని పనులు చక్కబెడుతోంది మాత్రం నాగబాబు, నాదేండ్ల మనోహరే. ఈ మధ్యన వైజాగ్ ఇష్యూలో కూడా పవన్ వెంట ఎక్కువగా కనిపించింది నాగబాబే. అయితే ఈ మెగా బ్రదర్ తమ్ముడికి అండగా నిలవడంలో ముందుంటారు. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాకాలిన రాజకియాంశాలపై కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆస్క్ నాగబాబు అంటూ సోషల్ మీడియావేదిక నుంచి జనసైనికుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. అయితే ప్రధానంగా జనసైనికులు ఒక సందేహాన్నే వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు టీడీపీతో పొత్తు ఉంటుందా? ఉంటే సీఎం క్యాండిడేట్ ఎవరు? అని అడుగుతున్నారు. అయితే దీనిపై నాగబాబు తనదైన రీతిలో సమాధానం చెబుుతున్నారు. కచ్చితంగా పవన్ రాజ్యాధకారం దిశగా అడుగులేస్తున్నారని బదులిస్తున్నారు. అంటే సీఎం క్యాండిడేట్ గా పవన్ ఉంటారని అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే విపక్షాలకు ఎటువంటి అస్త్రాలు ఇవ్వకుండా జాగ్రత్తపడుతునే.. తనదైన రీతిలో జన సైనికుల అనుమానాలను నివృత్తి చేయగలుతున్నారు.