Munugode By Election- KCR: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ దూరంగా ఉండనున్నారా అంటే అవుననే అంటున్నాయి టీఆర్‌ఎస్ వర్గాలు. ఎన్నికల నోటిఫికేషన్ వర్చిన తర్వాత పది రోజులు ఢిల్లీలోనే మకాం వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి.. ఇటీవలే తిరిగి వచ్చారు. ఈ నెలాఖరులో మునుగోడులో కేసీఆర్ సభ ఉంటుందని మొదట పార్టీ నాయకులు తెలిపారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే.. ఆయన ఇక ప్రచారం చేసే అవకాశం లేదని చెబుతున్నాయి.

అంతా కేటీఆరే…
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా హరీశరావు, కేటీఆర్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో వారు నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్నారు. హరీశ్‌రావు ఇంటింటా ప్రచారం చేస్తుంటే కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన కేటీఆర్ మనుగోడును దత్తత తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తాజాగా శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈనెలాఖరుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో రెండు పర్యాయాలు కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతన్నాయి. కేసీఆర్ పర్యటన రద్దు నేపథ్యంలోనే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నోటిఫికేషన్‌కు ముందే సీఎం సభ..
మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. సీఎం కేసీఆర్ ఆగస్టు 20న ప్రజాదీవెన సభ నిర్వహించారు. తాను బతికి ఉన్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టనివ్వనని ప్రకటించారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మాటలు నమ్మితే మోసపోతామని, గోస పడతామని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక గట్టుప్పల్‌లో మరో సభ పెడతానని ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్ల ప్రక్రియ పూర్తయినా కే సీఆర్ సభపై ఇప్పటి వరకు పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఉంటుందా లేదా అంటే ఉండకపోవచ్చనే గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ నేతలు రెండు బహిరంగసభలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు.

ఢిల్లీ వెళ్లొచ్చాక మనసు మార్చుకున్నారా?
కేసీఆర్ ఇటీవల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయన్‌సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లారు. అక్కడి నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు ఉన్నారు. దాదాపు 10 రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడ ఏం చేశారన్నది మాత్రం ఇప్పటికీ గోప్యతే. కూతరును లిక్కర్ స్కాం నుంచి బయట పడేసేందుకే కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ తాజాగా మునుగోడు ప్రచారానికి దూరంగా ఉండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారమంతా కేటీఆర్‌పైనే..
మునుగోడులో ఎన్నికల ప్రచార భారమంతా కేసీఆర్ తాజాగా కేటీఆర్‌పై పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఏ ఉపఎన్నికల్లో కేటీఆర్ పెద్దగా ప్రచారం చేయలేదు. దుబ్బాకతోపాటుతాను సిట్టింగ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో వచ్చిన ఉన్న హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. మొత్తం బాధ్యతలను హరీశ్‌రావే చూసుకున్నారు. కానీ మునుగోడు విషయంలో మాత్రం ఆయన రంగంలోకి దిగారు. కేసీఆర్ ప్రచారానికి రావడం లేదని.. అదుకే కేటీఆర్ రంగంలోకి దిగారన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో వినిపిస్తోంది. ఉపఎన్నికల్లో సాధారణంగా కేసీఆర్ ప్రచారం చేయరు. అధికార పార్టీగా ఉండి ఉపఎన్నికల్లో ఓడిపోతే ఓ సమస్య .. సీఎం ప్రచారం చేసి మరీ ఓడిపోతే మరో సమస్య. అందుకే కేసీఆర్ దూరంగా ఉంటారని చెబుతారు. అయితే పార్టీకి చేదు ఫలితం వస్తే.. కేసీఆర్ బహిరంగసభ నిర్వహిస్తే.. ప్రచారం చేస్తే ఫలితం వేరేగా ఉండేదన్న విశ్లేషణలు వస్తాయి. దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పుడు ఇదే చెప్పుకున్నారు. మరి మునుగోడులో ఈ చాన్స్ ఇవ్వకూడదని చివరి రోజు అయినా కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగిస్తారో లేదో చూడాలి.