Nadendla Manohar: ‘ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ వేదికగా నేను స్పీకర్ గా ఉన్న సమయంలోనే జగన్ రెడ్డి అవినీతిని తూర్పూరబట్టిన ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు ఇప్పుడు అందుకు భిన్నంగా పదవులను కాపాడుకోవడం కోసం అదే వ్యక్తిని పొగడటం విడ్డూరమ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ఆలోచిస్తాడు.. తన సొంతం కోసం ఎలా మాట్లాడతాడు.. సామాన్యుడిని ఎందుకు పట్టించుకోడనే విషయాలను లోతుగా మాట్లాడిన ఇద్దరు నేతలు ఇప్పుడు వింతగా మాట్లాడుతున్నారని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘ముందుగా చెప్పినట్లుగా జనవాణి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర పరిధిలో విశాఖలో నిర్వహిస్తున్నాం. దీన్ని వాయిదా వేసుకోవాలని, ఆపాలని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జనవాణి కార్యక్రమం గురించి వారికి అంతగా తెలిసి ఉండదు. వందల కిలోమీటర్ల నుంచి వచ్చి జనవాణి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి మహిళలు, దివ్యాంగులు, పేదలు వస్తున్నారు. ఆయనకు తమ సమస్యను చెబితే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి బయటకు వస్తుందని భావిస్తున్నారు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ఆపాలని కోరడం వివేకం కాదు. దీన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ప్రభుత్వం పరిష్కరించని ఎన్నో సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. దాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా విని, వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖలకు లేఖలు రాస్తున్నారు. ఇదో గొప్ప ప్రజా కార్యక్రమం అని కొనియాడారు.

* పదవులు పొంది.. ఉత్తరాంధ్ర కు చేసిందేమిటి..?
ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు, కీలక శాఖలను నిర్వర్తించారు. ప్రభుత్వంలో కీలక పదవులు పొందారు. అయినా ఈ నేతలకు ప్రజల అభ్యున్నతి, ప్రాంత అభివృద్ధి గుర్తు లేదు. ఇన్ని పదువులు అనుభవించి ఏ ప్రయోజనం..? ఇక్కడి ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగుల సమస్యను అంతర్జాతీయంగా తీసుకెళ్లి, ఎందరో నిపుణులను తీసుకొచ్చి, ప్రజలకు ఆరోగ్య భరోసా నింపిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. రాష్ట్రంలోనే 40 శాతం మంది మత్స్యకారులు ఉత్తరాంధ్రలో నివసిస్తారు. వారికి సరైన బతుకు భరోసా లేక వేరే ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా జీవిస్తూ, ఇతర రాష్ట్రాల్లో వేటకు వెళ్లి ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు.
* గిరిజన యూనివర్శిటీ ఏదీ.. వలసలకు అడ్డుకట్టేది..
రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్రకు వచ్చిన గిరిజన యూనివర్శిటీ ఏమయింది..? రూ.834 కోట్లతో యూనివర్శిటీ నిర్మాణంపై నోరు మెదపరు ఎందుకు..? గత ప్రభుత్వం రూ.10 కోట్ల ఖర్చు చేసి ప్రహరీ నిర్మించినా, ఇప్పటి వరకు దాని కోసం నిధులు తీసుకురాలేకపోయారు. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల-స్రవంతి ప్రాజెక్టుకు ముచ్చటగా మూడోసారి జగన్ శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు అతీగతీ లేదు. సాగునీటి రంగ కేటాయింపులు ఉత్తరాంధ్రకు లేవు.
* వైసీపీకి చిత్తశుద్ధి లేదు
మూడు రాజధానుల మీద వైసీపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా ప్రవేశపెట్టిన తీర్మానాలు, చట్టాలు ఎందుకు ఉపసంహరించుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించి, ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి దానిలో చలి కాచుకోవాలనేది వైసీపీ ప్రభుత్వ పన్నాగం. గతంలోనూ పచ్చటి అమలాపురంలోనూ ఇదే పద్ధతిలో విధ్వసం చేయాలని చూశారు. అక్కడి ప్రజలు దీన్ని గమనించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా దీనిపై చైతన్యవంతులు కావాలి. ఎన్నో పోరాటాల వేదిక ఉత్తరాంధ్ర. ఎందరో గొప్ప నాయకులను అందించిన నేల. అలాంటి నాయకుల స్ఫూర్తిని ప్రజలు అందిపుచ్చుకొని వైసీపీ కుటిల పన్నాగాలను తిప్పికొట్టాలి. అక్కడ భూములు, ప్రకృతి ప్రసాదించిన సహజ ఆస్తులపై కన్నేసి మాత్రమే వీరు కొత్తరాగం అందుకుంటున్నారు తప్ప మరేమీ కాదని గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. గత ప్రభుత్వం విశాఖ భూముల కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ రిపోర్టును బయటపెట్టాలి. మీలో మీరే గొడవలు పడి.. సామాన్యులకు సైతం విశాఖలో జరిగిన భూ కుంభకోణాల గురించి చెబుతున్నారు.
* అమరనాథ్ .. జనసేన మీద ప్రెస్ మీట్లు పెట్టడానికా మీకు మంత్రి పదవి
చిన్న వయసులోనే మంత్రి పదవి పొందిన ఉత్తరాంధ్ర మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ మొదట తన శాఖ పనితీరు మీద దృష్టి పెట్టాలి. రోజువారీ ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీని తిట్టడానికి మాత్రమే మీకు పదవి ఇచ్చారా..? కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ అనవసర విమర్శలు చేయడం పద్ధతి కాదు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం మీద దృష్టి నిలపాలి. గతంలో ఏపీఐఐసీ పరిశ్రమల కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను నేడు హౌసింగ్ ప్రాజెక్టుల కోసం అమ్ముతామని, రూ.400 కోట్ల రూపాయలు సేకరిస్తామని చెబుతుంటే ఎందుకు మీరు స్పందించరు..?
*ఐటీ టవర్లన్నీ ఖాళీ.. ఇదీ మీ ప్రొగ్రెస్ రిపోర్ట్
మధురవాడలోని మిలీనియం టవర్ – ఎ ప్రాంగణంలో 2 లక్షల చదరపు అడుగులు నిర్మిస్తే, కేవలం లక్ష చదరపు అడుగులే ఉపయోగిస్తున్నారు. అలాగే మిలీనియం ‘టవర్ బీ’లో 1.13 లక్షల చదరపు అడుగులు నిర్మిస్తే, ఒక చదరపు అడుగు ఉపయోగించుకోవడానికి ఐటీ కంపెనీలు రాలేదు. కాకినాడలోనూ 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేసినా ఫలితం లేదు. అంతా ఖాళీగా ఉంది. తిరుపతిలో ఐటీ టవర్ 50 వేల చదరపు అడుగులతో ఏర్పాటు చేసినా అక్కడకు ఎవరూ రాలేదు. అచ్యుతాపురంలో 5,500 చదరపు అడుగులతో ఏర్పాటు చేసిన భవనం ఖాళీగా ఉంది. బొబ్బిలిలో 27 వేల చదరపు అడుగులతో భవన నిర్మాణం జరిగితే, అక్కడా ఒక ఐటీ పరిశ్రమ ఇప్పటికీ రాలేదు. ఖాళీగా ఉందని ఆ బిల్డింగ్ ను వాడుకొంటామని రెవెన్యూ శాఖ అడగలేదా? శ్రీకాకుళం 2,500 వేల చదరపు అడుగులతో నిర్మించిన భవనాన్ని ఎవరికీ కేటాయించలేదు. అక్టోబరు 1వ తేదీ నుంచి విశాఖకు ఇన్ఫోసిస్ వస్తుందని ప్రచారాలు చేశారు.. ఈ రోజు అక్టోబరు 13. ఇన్ఫోసిస్ రాలేదు. వేయి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. అందులో ఏదీ కొత్త ఉద్యోగం కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఇన్ఫోసిన్ అక్కడ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించాలి అనుకుంటే.. దానికి కూడా ప్రభుత్వం తగిన విధంగా స్పందింకపోతే, వారు దాన్ని ప్రారంభించలేదు. ఇదీ మీ ప్రొగ్రెస్ రిపోర్టు గుడివాడ అమర్నాథ్ గారు. వీటిపై ముందు మీరు దృష్టి నిలపండి.
* క్షేత్రస్థాయికి పవన్ కళ్యాణ్ పర్యటనలు
ప్రజల సమస్యలను, వారి వేదనలు వినడానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయికి వస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్ర సమస్యల మీద ప్రత్యేక దృష్టి నిలుపుతారు. సామాన్యుల కోసం ఆయన నిలబడతారు. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా, ప్రజలకు అండగా మాట్లాడతారు. మీ పార్టీ కార్యక్రమాలను మీరు చేసుకోండి.. జనసేన పార్టీ కార్యక్రమాలను మేం చేసుకుంటాం. రెచ్చగొట్టేలా మట్లాడటం ఎవరికీ మంచిది కాదు. సామాన్యుడికి అండగా నిలబడి… మీ భూదందాలు, దౌర్జన్యాలు మేం ప్రజలకు వివరిస్తాం. ప్రజల తరఫున పోరాటం చేస్తాం.. 15వ తేదీన వైసీపీ గర్జన చేయబోయే ముందు… సిట్ రిపోర్టు బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రిని వైసీపీ ప్రజాప్రతినిధులు కోరాలి’’ అన్నారు.