రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ సామాజిక సంక్రమణ దశకి చేరుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813 కి చేరింది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుమానితులకు పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. గతంలో రోజుకు 2 వేల పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుతం 5,700 వరకూ నిర్వహిస్తున్నారు.
తాజాగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసులకు మూలాలు ఎక్కడ అనేది కనుక్కోంవడం అధికారులకు సాధ్యం కావడం లేదు. ఇటువంటి కేసులు రాష్ట్రంలో 52 వరకూ వున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల విజయవాడ నగరం మాచవరం ప్రాంతంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ ఆమెకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారుల ఆరా తీయగా తాను బయటకు ఎక్కడికి వెళ్లలేదని తేల్చి చెప్పింది ఆ మహిళ. ఈ కేసుకు లింక్ ఎలా అన్నది అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మిస్టరీ నడుస్తోంది. ఈ మిస్టరీ ఛేదించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుల మిస్టరీని త్వరలోనే చేదిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.
ఈ కేసుల మిస్టరీ వీడకపోతే అనేక అనుమానాలు తావిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో కరోనా సామాజిక సంక్రమణ వ్యాప్తి దశకు చేరుకుందనే భావించాల్సి వస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వం ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేయడం, వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. అప్పుడే రాష్ట్రంలో కరోనా కు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.