Ram Mandir
Ram Mandir: శ్రీరాముడు నడయాడిన నేలలో నాడు రాముని పట్టాభిషేకమంత వైభవంగా అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముహూర్తం దగ్గర పడుతుండడంతో అయోధ్య అంతా రామమయంగా మారుతోంది. దేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఈ క్రమంలో ప్రాణప్రతిష్ట ఉత్సవాలు మంగళవారం(జనవరి 16)నుంచి ప్రారంభమయ్యాయి. అయోధ్యలోని హనుమాన్ ఆలయాల్లో సుందరకాండ పారాయణం జరుగుతోంది.
రామునికి అనిస్ పూలు..
ఇక బాలరాముడి ప్రాణప్రతిష్ట రోజు రాముడికి అవసరమైన పూలు అందించేందుకు ఓ ముస్లిం ముందుకు వచ్చాడు. అయోధ్యలో భారీ పూలతోట ఉన్న మహ్మద్ అనిస్ శ్రీరాముని పూజకు అవసరమైన పూలు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. తనకు అవకాశం కల్పించిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అనిస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండడగా ఐదు తరాలుగా అనిస్ కుటుంబం రామ్‌లల్లా, హనుమాన్ గర్హి, అయోధ్యలోని ఇతర ఆలయాలకు పూలు అందిస్తోంది.
మతసామరస్యంతో..
అయోధ్యంలో హిందువులు, ముస్లింలు మతసామరస్యంగా ఉంటామని అనిస్ తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నాడు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట రోజు తన తోటలోని గులాబీలను శ్రీరామునికి సమర్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అయోధ్య భక్తిని చాటి.. ఐక్యతను ప్రదర్శిస్తుందని వెల్లడించాడు.
18న సెక్యూరిటీ రిహార్సల్స్..
ఇదిలా ఉండగా, అయోధ్యలో ఈనెల 22న నిర్వహించే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సుమారు 7 వేల మంది వరకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈమేరకు జనవరి 18న ఒకసారి సెక్యూరిటీ రిహార్సల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి వైఫల్యం లేకుండా కమాండోలు పహారా కాస్తున్నారు. ఇప్పటికే అయోధ్య నగరం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లిపోయింది.