Murder of a friend for ‘love’ ప్రేమ ఎంత పని అయినా చేయిస్తుంది. ప్రేమ కోసం ప్రాణాలు తీస్తారు.. పోస్తారు. స్వయంగా స్నేహితుడి ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడలేదు. అమ్మాయి కోసం ఏకంగా స్నేహితుడిని లేపేసిన మిత్రుడి వ్యవహారం సంచలనంగా మారింది.

ప్రేమ వ్యవహారం ఇద్దరు మిత్రుల మధ్య వైరానికి దారి తీసి హత్య చేసే వరకు వెళ్ళింది.ఈ ఘటనలో ఫుట్ బాల్ క్రీడాకారుడు గిలకా దీపక్ ఆకాష్ (24) హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు బాధ్యులైన ప్రభా,శ్రీరామ గోపీకృష్ణ, అతనికి సహకరించిన మొత్తం 11 మందిని పోలీసులు వారం రోజుల్లో అరెస్ట్ చేశామని నగర్ డీసీపీ జాషువా తెలిపారు.
నగరంలోని కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలోని ఎఎఫ్-3 అపార్ట్ మెంట్ లో గత నెల 31వ తేదీ దీపక్ ఆకాష్ హత్యకు గురయ్యాడు . సమాచారం తెలిసిన వెంటనే పటమట పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు దీపక్ ఆకాష్ గతంలో గుణదలలో నివసించేవాడు. ఓ యువతి విషయంలో ఆకాష్ కు, ప్రభాకు మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 31న మద్యం సేవించిన తరువాత ఆకాష్, ప్రభాల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది.
కనకదుర్గా గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్-1లో గల సిటీ టవర్ అపార్ట్మెంట్ లో ఉన్న ఆకాష్ ను ప్రభా అతడి స్నేహితులు కత్తితో పొడిచి చంపి అక్కడ నుండి పరారయ్యారు. సమాచారం తెలియగానే వెంటనే స్పందించిన పటమట పోలీసు స్టేషన్ వారు ఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఆదేశాలతో, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణా టాటా మాట్లాడుతూ నగరంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని నగరంలో రౌడీయిజంకు, హింసాత్మక చర్యలకు ఎవరు పాల్పడిన కఠినంగా శిక్షిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరవడంతో పాటు పి.డి చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోకపోతే నగర బహిష్కరణ తప్పదని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలోని రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై నిఘాను ముమ్మరం చేశామని, నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రతి ఒక్కరిపైనా వేటు తప్పదని అన్నారు.