
ఢిల్లీ అల్లర్లు హింసాత్మకంగా మారి అనేకమందిని బలితీసుకుంటున్న సమయంలో సిఏఏ నిరసనకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయుకలు అనురాగ్ శర్మ, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని తప్పుబట్టి, వెంటనే ఆ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టుకి బదిలీ అయిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ విషయమై రాజకీయదుమారం రేగింది. అయన బదిలీ పై స్పందించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె జి బాలకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా.. వ్యవహరించాల్సింది అని బాలకృష్ణన్ అన్నారు. దేశంలో పరిస్థితి చాలా అస్థిరంగా ఉన్నప్పుడు మరియు మీడియా, దేశ ప్రజలు చురుకుగా ఉన్నప్పుడు.. అర్ధరాత్రి బదిలీ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రజలు వేరే విధంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు భిన్నంగా అర్థం చేసుకోగలరు అని మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసును జస్టిస్ మురళీధర్ స్వయంగా తీసుకోలేదని ఆ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి ఎన్ పటేల్ సెలవులో ఉన్నందున, అతను మూడవ సీనియర్ న్యాయమూర్తి కావడంతో, ఈ కేసును విచారించిన ప్రత్యేక ధర్మాసనానికి జస్టిస్ మురళీధర్ నేతృత్వం వహించారు. జస్టిస్ మురళీధర్ ను మరుసటి రోజు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో చేరమని కోరినట్లు తాను భావించడం లేదని మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ అన్నారు.సాధారణంగా అటువంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడినప్పుడు, బదిలీ చేసిన న్యాయమూర్తి కొత్త పోస్టింగ్ కోసం తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఏడు రోజుల సమయం ఇవ్వబడుతుందని జస్టిస్ బాలకృష్ణన్ తెలిపారు.
ఇక ఈ బదిలీపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కేసుతో ఈ బదిలీకి సంబంధం లేదని పేర్కొంది. ఇక మురళీధర్ బదిలీకి సిఫారసు ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం చేసిందని న్యాయమూర్తి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొంది.