మరో ఎనిమిది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు బిజెపికి వణుకు పుట్టిస్తున్నది. వరుసగా ఒకొక్క రాష్ట్రంలో ఓటమి చెందుతూ వస్తున్న బీజేపీతో జత కొనసాగితే తనకు ఓటమి తప్పదనే నిర్ణయానికి నితీష్ వచ్చారా అనే అనుమానాలు వారికీ కలుగుతున్నాయి.
హఠాత్తుగా అసెంబ్లీలో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా నితీష్ తీర్మానం తీసుకువచ్చి ఆమోదింప చేయడం బిజెపికి మింగుడు పడటం లేదు. ఈ తీర్మానం విషయం తమకు చివరి నిమిషం వరకు తెలియదని బిజెపి ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను ప్రధాన ఎన్నికల నినాదం చేసుకోనున్న బిజెపికి నితీష్ తీసుకున్న వైఖరి మింగుడుపడడం లేదు. రానున్న రోజుల్లో నితీష్ మళ్లీ మహాకూటమి పంచన చేరతారా అనే ఊహాగానాలు ఉపందుకొంటున్నాయి. ఈ తీర్మానం తర్వాత 2015లో వలే జెడియు, ఆర్జేడీ లతో కలసి ఈ సారి కూడా కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది.
ఇవ్వన్నీ గాక ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ తో ఈ వారం వరుసగా రెండు సార్లు నితీష్ సమావేశం కావడం బిజెపికి కలవరం కలిగిస్తున్నది. 2017లో ఆర్ జె డి తో పొత్తు తెంచుకున్న తర్వాత తేజస్విని విడిగా నితీష్ కలవడం ఇదే కావడం గమనార్హం.
గురువారం అసెంబ్లీ స్పీకర్ విజయ్ చౌదరి కార్యాలయంలో ముఖ్యమంత్రితో తేజస్వి భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక సందర్శనగా తేజస్వి అభివర్ణిస్తున్నప్పటికీ దీని వెనుక తెరచాటు మంత్రాంగమేదో ఉందని బిజెపి అనుమానిస్తోంది.నితీష్, తేజస్వి మధ్య భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియరానప్పటికీ తేజస్వి మాత్రం ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం మాత్రం చేశారు.
అమిత్ షాను అరవింద్ కేజ్రీవాల్ కలవగా లేంది తాను నితీష్‌జీని కలిస్తే తప్పేంటని ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. తాను మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశానని, ఇందులో వేరే అంతరార్థం వెతకవద్దని ఆయన కోరారు.
దాదాపు మూడేళ్ల అనంతరం నితీష్, తేజస్వి మధ్య మొదటిసారి సమావేశం గత మంగళవారం నితీష్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించిన రోజున ముఖ్యమంత్రి ఛాంబర్‌లో జరిగింది. ఈ భేటీతో మళ్లీ నితీష్ తన పాత దోస్తీని సమీప భవిష్యత్తులో పునరుద్ధరించుకుంటారన్న ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది.
జెడియు, ఆర్‌జెడి మధ్య మరోసారి పొత్తు సాధ్యం కాదని ఆర్‌జెడి వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆ అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతోంది. నితీష్ కుమార్ లౌకిక వైఖరిని ఎవరం ప్రశ్నించలేమని, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తొలి ఎన్‌డిఎ రాష్ట్ర ప్రభుత్వం బీహార్ అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అవధేష్ సింగ్ చెప్పారు. సహజంగానే కాంగ్రెస్ నేతల ప్రకటనలు బిజెపి ఎమ్మెల్యేలలో కలవరం పుట్టిస్తున్నాయి.