Munugodu by-elections: ధనిక రాష్ట్రంలో వ్యవస్థలు పతనమయ్యాయి: దానికి మునుగోడు ఒక ఉదాహరణ

Munugodu by-elections: System collapse in Telangana :  మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి.  తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుస్తాడని దాదాపుగా అందరూ తేల్చి చెప్పారు. ఆ సంస్థలు చెప్పినట్టు కాకుండా ఇప్పుడు వెల్లడవుతున్న ఫలితాల్లో పోటాపోటీ కనిపిస్తోంది.. ఇక ఎన్నిక జరిగిన తీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఎంత ఘోరంగా విఫలమైందో […]

Written By: Bhaskar, Updated On : November 6, 2022 3:10 pm
Follow us on

Munugodu by-elections: System collapse in Telangana :  మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి.  తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుస్తాడని దాదాపుగా అందరూ తేల్చి చెప్పారు. ఆ సంస్థలు చెప్పినట్టు కాకుండా ఇప్పుడు వెల్లడవుతున్న ఫలితాల్లో పోటాపోటీ కనిపిస్తోంది.. ఇక ఎన్నిక జరిగిన తీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఎంత ఘోరంగా విఫలమైందో అర్థమవుతున్నది. సాధారణ ఎన్నికలకు పట్టుమని 12 మాసాల వ్యవధి కూడా లేని తరుణంలో జరిగిన ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం పోటీపడిన ప్రధాన పార్టీలు టిఆర్ఎస్, బిజెపి విచ్చలవిడిగా డబ్బు వెదజల్లాయి. దాదాపుగా రెండు నెలలపాటు ఓటర్లను మత్తులో ముంచెత్తాయి. ఒక్క ఓటుకు కనీసం మూడువేలవంతున పంచాయి. ఇంకా తమకు ఎక్కువ కావాలని కొన్నిచోట్ల ఓటర్లు ధర్నాలు చేశారు. ఎన్నికల కమిషన్ కి మాత్రం ఇవి ఏవి పట్టలేదు. “న్యాయస్థానంలో కేసు ఓడిపోయిన వాడు అక్కడ ఏడిస్తే.. గెలిచినవాడు ఇంటికి వెళ్లి ఏడుస్తాడు.. ” ఎందుకంటే ఇద్దరు జేబులు ఖాళీ అవుతాయి కాబట్టి. ఇప్పుడు  మునుగోడు లో కూడా ఇదే జరగబోతోంది. ఉప ఎన్నికల్లో విజయం కోసం వందల కోట్ల ఖర్చు చేయాల్సి రావటం తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం. ఏడాది బాగోతానికి వందల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినందుకు ఓడిన వాడితో పాటు గెలిచినవాడు కూడా ఏడ్వాల్సిన పరిస్థితి. మునుగోడు ఎన్నికలు అత్యంత ఖరీదైనదిగా మార్చడానికి కారణం టీఆర్ఎస్, బిజెపి మధ్య నెలకొన్న రాజకీయ వైరమే. అధికారకాంక్షతో ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశాయి. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత కూడా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు టిఆర్ఎస్, తెలంగాణలో ఎలాగైనా అధికారులకు రావాలని కాంక్షతో బిజెపి పరిశీలించడంతో ఎన్నికల ప్రక్రియ నవ్వులపాలైంది ఓటర్లను అవినీతిపరులుగా మార్చింది.
మునుగోడు ఒక ఉదాహరణ
వ్యవస్థలు పతనం అయితే జరిగే అనర్ధాలకు మునుగోడు ఉపఎన్నిక ఒక ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో అధికార పార్టీకి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నప్పటికీ తటస్థంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ అచేతనంగా ఉండి పోవడం క్షమార్హం కాదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా అధికారంలోకి వస్తున్న పార్టీలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో పోటీ పడుతున్నాయి.. ఇక మునుగోడు ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చింది. ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల్లో డబ్బులు పంచడం, తీసుకోవడం, ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేయడం ఎవరికీ తప్పుగా అనిపించడం లేదు. దీనిని సమర్థించుకోవడం గమనార్హం. బాధిత రాజకీయ పార్టీలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. అవకాశం వచ్చిన ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి నైతిక చర్యలకు పాల్పడుతున్నందున కొనుగోలు వ్యవహారాన్ని కూడా ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఏం ప్రభావం ఉంటుంది
మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం తెలంగాణ సమాజం పై ఎలా ఉండబోతున్నది అనేది ఇప్పుడు ప్రశ్న.. ఒక ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటే సామాన్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనగలరా? 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయగలరా? రాజగోపాల్ రెడ్డి ని పదేపదే కాంట్రాక్టర్ అని దెప్పి పొడిచిన టీఆర్ఎస్ చేస్తున్నది మాత్రం ఏమిటి? విలువలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఎంతమంది సామాన్యులకు టికెట్లు ఇచ్చారు? ఇక సామాన్యుల సంగతి అటు ఉంచితే ప్రతిపక్షాలు కూడా డబ్బు విషయంలో పోటీ పడగలవా? దీనికి లేదనే చెప్పాల్సి ఉంటుంది. మునుగోడులో ఇది రుజువైంది కూడా. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ తో, అధికారంలో ఉన్న బిజెపితో డబ్బు విషయంలో పోటీ పడలేక చేతులెత్తేసింది. మునుగోడులో మూడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఎందుకు ఉంటుంది? ఏడాది వ్యవధి మాత్రమే ఉన్న ఈ ఉప ఎన్నిక కోసం టిఆర్ఎస్, బిజెపి అన్ని కట్టుబాట్లు తెంచేసుకున్నాయి. ఇష్టానుసారంగా వ్యవహరించి డబ్బులు ఖర్చు పెట్టాయి. పాలకుల మధ్య ఈగో సమస్య ఏర్పడితే విలువలు ఏ స్థాయిలో పతనం అవుతాయో చెప్పడానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక నిదర్శనం. మునుగోడులో గెలిస్తే తనకు తిరుగులేదని, తానే తెలంగాణ బాద్ షా అని కేసిఆర్, ఓడినా తామే టిఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకుంటూ బిజెపి నాయకులు సాధారణ ఎన్నికలకు వెళ్ళవచ్చు. ఈ క్రమంలో తాము పతనమై, ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించినందుకు ఏదో ఒక రోజు ఈ రెండు పార్టీలు విచారం వ్యక్తం చేయక తప్పదు.