Munugode By Election Polling: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చెదరు మదరు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగుతోంది. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో తాము ఓట్లు వేయమని రాంకీ తండావాసులు నిరసన చేపట్టారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆ తండావాసులతో ఫోన్లో మాట్లాడారు. మీ గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇవ్వడంతో వారంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చండూరులోని ఓ పోలింగ్ కేంద్రంలోకి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వస్తుండగా.. ఉన్న టిఆర్ఎస్ ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కొద్దిసేపు పోలింగ్ ను నిలుపుదల చేశారు. ఇక చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ, చండూరు మండలాల్లో ఇప్పటికీ పోలింగ్ కొనసాగుతూనే ఉంది. రాత్రి పొద్దుపోయే దాకా కూడా పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు.

ఓటర్లు ఎటువైపు మొగ్గారు
సాధారణంగా ఉప ఎన్నికలంటే అధికార పార్టీకే కొంచెం ఎడ్జ్ ఉంటుంది. కానీ రాష్ట్రంలో నారాయణఖేడ్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రమే టిఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి విజయ దుందుభి మోగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇదే ఊపును మునుగోడు లోనూ కొనసాగించాలని బిజెపి అగ్రనాయకత్వం ఉవ్విళ్లూరింది. అయితే టిఆర్ఎస్ కూడా పోటాపోటీగా ప్రచారం చేయడంతో పరిస్థితి రంజుగా మారింది. మధ్యలో కాంగ్రెస్ కూడా యాడ్ కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. అయితే ఈరోజు ఉదయం నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం కాస్త నెమ్మదించినా సాయంత్రం వరకు ఊపందుకుంది. అయితే ఓటర్లు గుంభనంగా ఉండడంతో ఎవరి వైపు మొగ్గారు అనేది అంతు పట్టడం లేదు. అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు నమోదైన పోలింగ్ ను బట్టి ఓ దినపత్రిక నిర్వహించిన శాంపిల్ సర్వేలో గ్రామీణ ప్రాంత ఓటర్లు టిఆర్ఎస్ వైపు కాస్త మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇదే సమయంలో చౌటుప్పల్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తెలివిగా వ్యవహరించారని తెలుస్తోంది.
ఎవరి ధీమా వారిదే
గెలుపు పై ఎవరి దీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. లోలోపల మాత్రం భయపడుతూనే ఉన్నారు. మేం చేసిన అభివృద్ధి పనులకు ఓటర్లు పట్టం కట్టారని టిఆర్ఎస్ నాయకులు అంటుంటే.. మునుగోడు లాంటి గ్రామీణ స్థాయి నియోజకవర్గానికి ఏకంగా ముఖ్యమంత్రిని తీసుకొచ్చానని, విజయం నాదేనని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అయితే పోలింగ్ ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో.. అది ముగిసే వరకు ఎటువంటి అంచనాకు రాలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీనే ఎమ్మెల్యే స్థానం గెలుచుకుంటుందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. దుబ్బాక, హుజురాబాద్ లోనూ ఎగ్జిట్ పోల్స్ విఫలమైన తీరును మరి కొందరు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అయితే పోలింగ్ కు ఒక రోజు ముందు డబ్బుల పంపిణీ జోరుగా సాగిన నేపథ్యంలో తెలివిగా వ్యవహరించిన బిజెపి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇదే సమయంలో డబ్బుల పంపిణీ బాధ్యత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకు అప్పగించడంతో ఇక్కడి స్థానిక టిఆర్ఎస్ నాయకత్వం ఒకింత నారాజ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా సైలెంట్ గా బిజెపికి ఓట్లు మళ్ళేలా చేశారని వినికిడి. అయితే దీనిని కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కొట్టి పారేస్తున్నారు.