Munugode By Election 2022: సాధారణంగా తెలంగాణ పల్లెల్లో జాతరంటే ఒక ఉత్సాహం. మందు , విందు.. ఇంకా వగైరా వగైరా.. ఆ ఆనందానికి హద్దు ఉండదు.. ఏడాదికి ఒక మారు జాతర వస్తుంది కాబట్టి జనాల్లో ఆ స్థాయి ఉత్సాహం ఉంటుంది. ప్రస్తుతం అటువంటి జాతరను మునుగోడు ప్రజలు రోజూ చూస్తూ ఉన్నారు. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. తాగినోడికి తాగినంత, చిన్నోడికి తిన్నంత అన్నట్టుగా సాగుతోంది అక్కడి వ్యవహారం. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలని తలంపుతో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ఉన్నాయి.. ఈ మూడు పార్టీల్లో ఎవరూ ఖర్చుకు వెనకాడకపోవడంతో ఓటర్ల పంట పండుతోంది. ఓ రాజకీయ పార్టీ అయితే ఓటర్లకు తలా ఒక్కరికి తులం బంగారం చొప్పున ఇచ్చేందుకు సిద్ధమైందని ప్రచారం సాగుతోంది.

హుజురాబాద్ అనుభవంతో
హుజరాబాద్ గెలుపు అనుభవంతో బిజెపి ప్రయత్నాలు ప్రారంభించింది. జితేందర్ రెడ్డి సారధ్యంలో నాయకులు ప్రతీ ఇల్లు తిరుగుతున్నారు.. బూత్ కు ఒక నాయకుడిని నియమించడంతో ఓటర్లు చేజారి పోకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రతి ఒక్క ఓటర్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కొంతమంది కార్యకర్తలతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించి పోల్ చీటీలు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు గల్లంతు కాకుండా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక హుజురాబాద్ గెలుపు అనుభవంతో మండలాలు, గ్రామాలు, బూత్ ల వారీగా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లను భారతీయ జనతా పార్టీ రంగంలోకి దించింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం నేరుగా అమిత్ షా ఆధ్వర్యంలోని ఒక కోర్ టీమ్ పర్యవేక్షిస్తున్నది. ఇందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు జితేందర్ రెడ్డి సారథ్యంలోని బృందం అమిత్ షా కోర్ టీంకు అందజేస్తోంది.
టిఆర్ఎస్ కూడా
టిఆర్ఎస్ సైతం మండలాల ఇన్చార్జిలుగా మంత్రులను, ఒక్కో ఎంపిటిసి స్థానానికి ఒక్కో ఎమ్మెల్యేను నియమించింది. ప్రచార బాధ్యతను మొత్తం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మునుగోడు లోని అన్ని మండలాలను ఆయన కలియ తిరుగుతున్నారు. హుజరాబాద్, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని మునుగోడులో పునరావృతం చేయకుండా ఉండేందుకు ఆయన ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని పరిస్థితిని ప్రగతి భవన్ కు నివేదిస్తున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా తెప్పించుకుంటున్నారు.
కాంగ్రెస్ కూడా దీటు గానే
ఇక మునుగోడు నియోజకవర్గంలో పలుమార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. స్థానికురాలైన ఈమెకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.. పైగా ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నియోజకవర్గంలో గెలిస్తేనే 2023 ఎన్నికలకు ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది. తన సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే సంకల్పంతో స్రవంతి రెడ్డి కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. తన తండ్రికి ఉన్న చరిష్మా కలిసి వస్తుందని ఆమె ప్రబలంగా నమ్ముతున్నారు.

ఓటర్లకు పండగే పండుగ
మొన్న మన రాష్ట్రం మొత్తం దసరా పండుగ జరిగింది ఒక ఎత్తు అయితే.. మునుగోడు లో జరిగింది ఒక ఎత్తు. అని రాజకీయ పార్టీలు కలిపి ప్రతి ఇంటికి విడివిడిగా కిలో చొప్పున గొర్రెపోతు మాంసాన్ని పంపించాయి. క్వార్టర్ మందు బాటిల్ ఇందుకు అదనం. చోటామోటా కుల సంఘాల నాయకులు అయితే ఒక్కొక్కరు 10 నుంచి 50 వేల దాకా పుచ్చుకున్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో జరిగిన దసరా ఉత్సవాల ఖర్చు మొత్తం రాజకీయ పార్టీలే భరించాయి. ఏతావాతా దసరా పండుగ సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద మద్యం అమ్మకాలు 100 కోట్ల వరకు సాగితే.. ఒక్క మునుగోడు లోనే ఐదు కోట్ల వరకు సాగాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ప్రాంతంలో గొర్రెపోతుల కొరత ఉండడంతో ఓ రాజకీయపార్టీకి చెందిన నాయకుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి మూడు డీసీఎంల నిండా గొర్రెపోతులను తీసుకువచ్చారని ప్రచారం సాగుతోంది. తనకు ఓటు వేసి గెలిపిస్తే ఇంతకుమించి ఉంటుందని ఆయన ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఎలక్షన్లకు ముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక పోలింగ్ దగ్గర పడితే ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మూడు పార్టీలకు అర్థ బలం, అంగ బలం పుష్కలంగా ఉండటంతో.. ఖర్చులో ఎవరూ వెనుకకు తగ్గడం లేదు. మొన్నటిదాకా రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక జరిగింది హుజురాబాద్ లోనే అనుకున్నాం. కానీ దాని రికార్డును ఇప్పుడు మునుగోడు ఈజీగా అధిగమించేటట్టుంది.