Costly Arjitha Sevas: ప్రశాంతంగా దేవుడ్ని దర్శించుకునేందుకే భక్తులు దేవాలయాలను సందర్శిస్తుంటారు. మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబసభ్యులతో దైవదర్శనాలకు వెళుతుంటారు. కానీ వైసీపీ సర్కారు చర్యలు పుణ్యమా అని తనివితీరా దేవుడ్ని దర్శించుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఏపీలో ఏ దేవస్థానాన్ని తీసుకున్నా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు షాక్ కొట్టేలా ఉన్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరంలో టిక్కెట్ ధరలు ఉన్నాయి..దూరం నుంచే దేవుడ్ని దర్శించుకొని తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. భక్తి ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. భక్తుల నుంచి వీలైనంత త్వరగా రాబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దర్శనం టిక్కెట్ల ధరలు రోజురోజుకూ పెంచేస్తున్నారు. సామాన్య ప్రజలకు దేవుడ్నిదూరం చేస్తున్నారు.

సాధారణంగా ఎవరైనా దైవదర్శనాలకు బయలుదేరితే అన్ని దేవస్థానాలను సందర్శించుకునేలా ప్లాన్ చేస్తారు. ఇందుకు కొంత సమయం కేటాయిస్తారు. మరికొందరు సమయభావంతో కుదించుకుంటారు.ఇంకొందరైతే శీఘ్ర దర్శనాలు చేసుకొని వీలైనంత త్వరగా ఇంటిముఖం పట్టాలని భావిస్తారు. అయితే పెరిగిన దర్శనం టిక్కెట్ల ధరలు చూసి ఎన్నిరోజులైనా పర్వాలేదు.. సాధారణ దర్శనం చేసుకొని వెళదామన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ప్రధానంగా శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని దేవదాయ శాఖ అధికారులు కాస్ట్ లీగా మార్చేశారు. రోజంతా జరిగే ఉదయాస్తమాన సేవను లక్షా వేయ్యి పదహారు రూపాయిలుగా నిర్ణయించారు. రోజుకూ ఆరుగురు వరకూ ఈ సేవలకు అనుమతిస్తున్నారు. కొన్నాళ్ల కిందట వరకూ సర్వసేవా పథకం పేరిట రూ.5 వేలు ఉండేది. దానిని 20 రెట్లు పెంచడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సాయంత్రం స్వామివారి ఆలయంలో మంగళహారతి, పంచామృతాభిషేకం, స్వామివారి అంతరాలయంలో కుంకుమార్చన, వేదపండితుల ఆశీర్వచనం కలిపి ప్రదోషకాల సేవ పేరిట కొత్తగా ఒక పథకం తీసుకొచ్చారు. దీనికి రుసుంను రూ.25,116లుగా నిర్ణయించారు.
Also Read: Chiranjeevi Politics: చిరు వద్దంటున్నా లాగే ప్రయత్నం చేస్తున్నారే..
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో కూడా టిక్కెట్లు ధర పెంచి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం టిక్కెట్ ధర రూ.700 ఉండేది. దానిని రూ.5 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. అభిప్రాయం కోరుతూ ఆలయ నోటీసు బోర్డులో ప్రకటనను ఉంచారు. దీనిని చూసిన భక్తులు షాక్ కు గురయ్యారు. దేవదాయ శాఖ అధికారుల తీరును ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది.టిక్కెట్ ధరను యథాతధంగా ఉంచుతున్నట్టు దేవదాయ శాఖఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చే వరకూ పరిస్థితి వెళ్లింది.

విజయవాడ దుర్గమ్మను అంతరాలయం నుంచి దర్శించుకునే వీలుంది. భక్తులు ఎక్కువగా అమ్మవారిని దగ్గర నుంచి చూసేందుకు మొగ్గుచూపుతారు. దీని టిక్కెట్ రూ.300 ఉండేది. సామాన్య భక్తులకు భారమైనా.. అమ్మవారిని తనివితీరా చూడాలని కొనుగోలు చేశారు. అయితే టిక్కెట్ ధరను రూ.500కు పెంచేశారు. తొలుత దసరా రద్దీ దృష్ట్యా పెంచినట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ ధరనే కంటిన్యూ చేస్తున్నారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ ధరను రూ.50 నుంచి రూ.100కు పెంచారు. ఇప్పుడు అదే ధరను కొనసాగిస్తున్నారు. ఇలా దేవుళ్లు, అమ్మవార్ల దర్శనం అంటేనే వణుకు పుట్టేలా దేవదాయ శాఖ టిక్కెట్, ప్రత్యేక పూజల ధరను పెంచడంపై సామాన్య భక్తులు పెదవివిరుస్తున్నారు.
Also Read:Janasena Chief Pawan Kalyan: ఏపీని అధోగతి చేసి.. ఏంటీ గర్జనలు? వైసీపీకి పవన్ దిమ్మదిరిగే కౌంటర్