
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్జానంతో తమ కంపెనీ 5జి నెట్‌వర్క్ ను సిద్ధం చేసిందని ముకేశ్ అంబానీ ప్రకటించారు. అందుకు ముఖేష్ అంబానికి రెండు వ్యూహాలు ఉండొచ్చు.. అందులో ఒకటి ఆత్మనిర్భర భారత్ ఆలోచనకు దగ్గరగా ఉండాలని, రెండవది చైనా దిగ్గజ కంపెనీ హువావే సంస్థ భారత్ లో 5జి విస్తరణ ప్రయత్నాలకు ఇది గండికొట్టాలని కావొచ్చు. ఏది ఏమైనా ముకేశ్ అంబానీ పెట్టుబడుల వేటగాడు. గత మూడు నెలల కాలంలో ఆయన 11మంది భారీ ఇన్వెస్టర్లను ఆకర్షించి తన సంస్థలోకి 20బిలియన్ డాలర్ల సొమ్మును రాబట్టగలిగారు.
ఈ మొత్తం ద్వారా ఆయన 21బిలియన్ డాలర్ల సంస్థ అప్పులను తీర్చడమే కాకుండా ఈ-కామర్స్ రంగంలో దిగ్గజాలైన అమెజాన్‌లాంటి సంస్థలకు దీటుగా ఇండియాలో విస్తరించాలని భావిస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సప్ లకున్న 40 కోట్లమంది కస్టమర్లను దేశంలోని చిల్లర దుకాణాలకు అనుసంధానం చేయడం ద్వారా తన రిలయన్స్ మార్ట్ ను మరింత విస్తరించాలని అంబానీ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏప్రిల్ నెలలో ఫేస్‌బుక్ సంస్థ 6బిలియన్ డాలర్ల పెట్టుబడిని రిలయన్స్‌లో పెట్టడనికి ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ కారణంగా చైనాతో వ్యాపార సంబంధాలను సమీక్షించాలని భారత్ భావిస్తోంది. ఇండియాలో అత్యంత వేగంగా విస్తరించిన మొబైల్ నెట్‌వర్క్ గా మారిన రిలయన్స్ జియో గత సంవత్సరమే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
2016 సెప్టెంబర్ లో కార్యక్రమాలు ప్రారంభించిన రిలయన్స్ జియో, సుమారు 40 కోట్లమంది సబ్‌స్క్రైబర్లను సాధించి రికార్డు సృష్టించింది. రాబోయే మూడేళ్లలో 50 కోట్ల కస్టమర్లకు చేరువ కావాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో కిరాణ సరుకులను ఇంటింటికి చేర్చే మార్కెటింగ్ వ్యవస్థను సిద్ధం చేస్తామని జనవరిలో రిలయన్స్ ప్రకటించింది. ఇది ఇండియాలో అమెజాన్‌కు పోటీ సంస్థ కానుంది. మార్కెట్ విస్తరణకు ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయని అమెరికా టెక్నాలజీ కంపెనీలు భావిస్తున్నాయి. 2022నాటికి ఇంటర్నెట్ యూజర్లు 85కోట్లు దాటే అవకాశం ఉందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ సంస్థ అంచనా వేసింది. జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అధిపతి అయిన ముకేశ్ అంబాని ప్రస్తుతం ప్రపంచ కోటీశ్వరులలో 9వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ మేగజైన్ అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ 68.7 బిలియన్ డాలర్లు.