https://oktelugu.com/

MUDA scam : కర్ణాటకలో కాంగ్రెస్ గొంతు చించుకొని అరుస్తోంది గానీ.. యడ్యూరప్ప విషయంలో ఏం చేసిందో గుర్తుందా?

అయితే ప్రస్తుతం ఇదే సంకట స్థితిని సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. అయితే నాడు యడ్యూరప్ప అనుభవించిన బాధను సిద్ధరామయ్య చవిచూస్తున్నారని బిజెపి నాయకులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 17, 2024 10:23 pm
    MUDA scam

    MUDA scam

    Follow us on

    MUDA scam : ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లిన సంఘటనలు దాదాపు చాలా తక్కువ. గవర్నర్ లతో ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ.. యడ్యూరప్ప మినహా ఎప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి కూడా గవర్నర్ ఆదేశంతో విచారణ ను ఎదుర్కోలేదు. జైలుకు కూడా వెళ్ళలేదు . అయితే ప్రస్తుతం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యడ్యూరప్ప తర్వాతి స్థానాన్ని ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థలో ( MUDA) లో భూ కుంభకోణం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. ఫలితంగా కర్ణాటక రాష్ట్రంలో ఒకసారిగా సంచలనం నమోదయింది. గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడంతోనే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. సొంత రాష్ట్రం కావడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరు వచ్చేసారు. సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడారు. పలు విషయాలపై చర్చించారు. గవర్నర్ విచారణకు ఆమోదం తెలపడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని గొంతు చించుకొని అరుస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడే కాంగ్రెస్ నాయకులు ఒక విషయాన్ని మర్చిపోయారు. ప్రస్తుతం సిద్ధరామయ్య విషయంలో గవర్నర్ స్పందించిన తీరును పక్కన పెడితే.. ఇందులో ఉన్న పొలిటికల్ లక్ష్యాలను కాస్త దూరంగా ఉంచితే.. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసిందో ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది.

    2011లో ఏం జరిగిందంటే..

    2011లో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నారు. అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే లోకాయుక్తకు కర్ణాటక బాస్ గా సంతోష్ హెగ్డే అప్పట్లో కొనసాగారు. భూముల కేటాయింపు, మైడ్స్ విషయంలో యడ్యూరప్ప అక్రమాలకు పాల్పడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కొన్ని చానల్స్ విశ్లేషణాత్మక కథనాలను ప్రసారం చేశాయి. అప్పట్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉండడంతో కర్ణాటక కాంగ్రెస్ నాయకులు యడ్యూరప్ప పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ కు ఢిల్లీ నుంచి వర్తమానం రావడంతో యడ్యూరప్ప పై విచారణకు ఆయన ఆదేశించారు. అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గవర్నర్ తీసుకొన్న నిర్ణయం నేషనల్ మీడియాను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

    గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో లోకాయుక్త విచారణ నిర్వహించింది. విచారణ పూర్తికాగానే లోకాయుక్త కోర్టు యడ్యూరప్ప అరెస్టుకు వారంట్ జారీ చేసింది. 2011లో అక్టోబర్ నెలలో యడ్యూరప్ప అరెస్టు అయ్యారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.. భూములకు సంబంధించిన అక్రమ కేటాయింపులు జరిపారని లోకాయుక్త కోర్టులో పలు కీలకమైన సాక్షాలను ప్రొడ్యూస్ చేసింది. దీంతో యడ్యూరప్ప విచారణ ఖైదీగా 23 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసును సిబిఐ టేక్ ఓవర్ చేసింది. ఈ ఆరోపణలు రావడంతో యడ్యూరప్ప రాజకీయ జీవితం తలకిందులైంది. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య పై విచారణకు గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. భారతీయ జనతా పార్టీపై మండిపడుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తోందని విమర్శిస్తున్నారు. మరి నాడు గవర్నర్ భరద్వాజ్ తో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? సరే ఆ కేసు విచారణలో యడ్యూరప్ప ఏం చేశాడనేది తర్వాత తేలింది. కానీ నాటి గవర్నర్ భరద్వాజ్ అలా ఫిర్యాదు రావడం ఆలస్యం.. యడ్యూరప్పపై విచారణకు ఆదేశించారు. అయితే కర్ణాటకలో అప్పట్లో చాలా కాలం పాటు భరద్వాజ్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా రాజకీయాలు సాగాయి. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో యడ్యూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఇదే సంకట స్థితిని సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. అయితే నాడు యడ్యూరప్ప అనుభవించిన బాధను సిద్ధరామయ్య చవిచూస్తున్నారని బిజెపి నాయకులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.