Vemireddy Prabhakar Reddy: వైసీపీకి మరో ఎంపీ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఇప్పటికే వరుస ఎంపీలు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న కొలదీ ఎంపీలతో పాటు కీలక నాయకులు పార్టీని వీడుతుండడం అధికార పార్టీలో కలవరానికి కారణమవుతోంది. ఎంపీ బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రాజ్యసభ సభ్యుడు, కీలక నేత వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా ప్రకటించారు. వైసిపి ఆవిర్భావం నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆర్థికంగా కూడా పార్టీకి చేయూతనందించారు. కానీ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో కలత చెంది వైసీపీకి దూరంగా ఉన్నారు. చంద్రబాబుతో సమావేశం అయినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇటువంటి తరుణంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా వేంరెడ్డి ప్రకటించారు. దీనిని తక్షణమే ఆమోదించాలని అధినేత జగన్ ను కోరారు.
వాస్తవానికి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని హై కమాండ్ ప్రకటించింది. నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా నియమించారు. దీంతో వైసిపికి బలమైన అభ్యర్థి అవసరం అయ్యారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే సరైన అభ్యర్థి అని జగన్ భావించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమించారు. అయితే అప్పటికే మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చితేనే తాను పోటీ చేస్తానని వేంరెడ్డి షరతు పెట్టారు. అయితే ఇప్పుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ పట్టించుకోవడం మానేశారు. ఇది మనస్థాపానికి కారణమైంది.
నెల్లూరు సిటీ నియోజకవర్గ నుంచి అభ్యర్థిగా ఖలీల్ పేరును జగన్ ఖరారు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ను తప్పించి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు. అయితే ఈ విషయాన్ని వేంరెడ్డికి చెప్పలేదు. అనిల్ సూచన మేరకు డిప్యూటీ మేయర్ గా ఉన్న ఖలీల్ ను జగన్ ఎంపిక చేశారు. పైగా అనిల్ కు ఎంపీగా అవకాశం ఇచ్చారు. దీంతో అనిల్ సైతం రెచ్చిపోయారు. వేంరెడ్డి పై తిట్ల దండకం పూనుకున్నట్లు తెలుస్తోంది. అయినా సరే జగన్ పెద్దగా పట్టించుకోకపోవడంతో వేంరెడ్డి కలత చెందారు. పార్టీ పెద్దలకు దూరంగా జరిగిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ మధ్యన జగన్ ఢిల్లీ పర్యటనలో వేంరెడ్డిని కలిసి బుజ్జగించాలని చూశారు. కానీ వేంరెడ్డి విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల క్రమంలో నెల్లూరు పార్లమెంటు స్థానానికి విజయ్ సాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిని జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం. అదే సమయంలో వేంరెడ్డి సైతం పార్టీని వీడాలని భావించడంతోనే జగన్ ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నెల్లూరు అసెంబ్లీ స్థానానికి తన భార్యకు టికెట్ ఇవ్వాలని వేంరెడ్డి కోరారు. అనిల్ కుమార్ యాదవ్ అందుకు అంగీకరించలేదు. తన అనుచరుడు ఖలీల్ కు టికెట్ ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. దీంతో జగన్ అనిల్ వైపు మొగ్గు చూపారు. పార్టీకి ఇన్ని రకాల సేవలు అందించిన తనకు గుర్తింపు ఇవ్వకపోవడంపై వేంరెడ్డి కలత చెందారు. అదే సమయంలో చంద్రబాబు లైన్లోకి రావడంతో వేంరెడ్డి టిడిపిలో చేరేందుకుమొగ్గు చూపారు.అందుకే తాజాగా రాజీనామా ప్రకటించారు.ఆయన భార్య సైతం టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే వేంరెడ్డి రాజీనామాతో నెల్లూరు వైసీపీలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇది పార్టీకి పెద్ద దెబ్బ అని వైసిపి హార్ట్ కోర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.