Modi – AP : ప్రధాని మోదీ ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీలో కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అందులో ఏపీ తలరాతను మార్చే పథకాలు ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా విద్య, రైల్వే, విమానయానం, రవాణా రంగంలో రూ.32వేలకోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.జాతికి అంకితం చేశారు.ఇందులో విభజన హామీల్లో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులు ఉండడం విశేషం.
కేంద్ర విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ క్యాంపస్ ను ప్రధాని ప్రారంభించారు. తిరుపతి ఐఐటి, కర్నూలు ఐఐటి, హైదరాబాద్ ఐఐటిని జాతికి అంకితం చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ క్యాంపస్ ను ఆంధ్ర యూనివర్సిటీలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆనందపురం మండలం గంభీరం వద్ద నూతన భవనాలు నిర్మించారు.మొదటి దశ శాశ్వత పనులు పూర్తి కావడంతో ప్రధాని మోదీ ప్రారంభించారు. క్యాంపస్ ప్రాంగణంలో 7200 వృక్ష, ఫల, పూల జాతి మొక్కలను నాటనున్నారు. 1500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంటును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.
తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత భవనాలను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో ఈ రెండు క్యాంపస్లను ఏర్పాటు చేశారు. అకడమిక్ కాంప్లెక్స్ లో 52 ల్యాబ్లు, 14 ఫ్యాకల్టీ ఆఫీసులు, 27 లెక్చరర్ హాల్స్ ఉన్నాయి. 1450 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటివరకు బిజెపి న్యూట్రల్ గా వ్యవహరిస్తూ వచ్చింది. టిడిపి,జనసేన కూటమిలో చేరనుందని ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీకి తలమానికంగా నిలిచే కీలక ప్రాజెక్టులను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటి విషయంలో క్రెడిట్ దక్కించుకునేందుకు అన్ని పార్టీలు పాకులాడుతాయనడంలో ఎటువంటి సంశయం లేదు.