Janasena: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వైసిపి దూకుడు మీద ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 70 మంది సిట్టింగ్లను మార్చింది. ఇంకా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చేసరికి ఒక క్లారిటీ లేకున్నా.. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జనసేనకు రెండు సీట్లు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం తో పాటు కాకినాడ ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు సమాచారం. అయితే ఆ రెండు ఎంపీ సీట్లకు సంబంధించి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది.
జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు తెలిపారు పవన్. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. దాదాపు 130 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయినా సరే గత ఐదేళ్లుగా జనసేన నేతలు పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. అటువంటి నేతల్లో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు సైతం పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీంతో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకే సీట్ల సర్దుబాటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అయితే ఎంపీ సీట్లకు అభ్యర్థుల కేటాయింపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పొత్తులో భాగంగా కేవలం రెండు ఎంపీ స్థానాలు మాత్రమే జనసేనకు కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీ నుంచి జనసేన లో చేరారు. అక్కడ ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి పవన్ ది. అటు కాకినాడకు సైతం సాన సతీష్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈయన లోకేష్ కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే వ్యాపారవేత్తగా ప్రచారం జరుగుతోంది. సతీష్ ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిశారు. కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని కోరారు. దీనికి పవన్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని శ్రేణులకు ఇంజెక్ట్ చేస్తున్నారు. దీంతో బయట వాళ్లకు ఎంపీ స్థానాలకు కేటాయించడం ఏమిటన్న ప్రశ్న పార్టీ నుంచి ఉత్పన్నమవుతోంది. దీనిని పవన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.