CM Jagan : సంచలనం : జగన్ పై హైకోర్టుకెక్కిన సొంత పార్టీ ఎంపీ

జగన్ కు సహకరిస్తున్న పారిశ్రామికవేత్తల్లో సైతం ఒక రకమైన భయం కల్పించేందుకు రఘురామ కృష్ణంరాజు ఈ ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Written By: NARESH, Updated On : November 3, 2023 6:47 pm
Follow us on

CM Jagan : ఏపీ సీఎం జగన్ పై సొంత పార్టీ ఎంపీ న్యాయ పోరాటానికి దిగారు. ఆయన అవినీతిపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఎంపీ అధినేత పై ఏకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర అధ్యయనం చేసి.. ప్రతివాదులుగా చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత కొంతకాలంగా వైసిపి హై కమాండ్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు తిరుగుబాటు బావుట ఎగురవేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తో పాటు పార్టీ నేతలపై నిత్యం విమర్శలకు దిగుతుంటారు. టిడిపి అనుకూల మీడియాలో నిత్యం మాట్లాడుతూ ఏకంగా సీఎం జగన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట ఏకంగా సీఎం జగన్ పైనే హైకోర్టును ఆశ్రయించడం విస్తు గొలుపుతోంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ఆయాచిత లబ్ధి పొందిన సంస్థలు, కంపెనీల యాజమాన్యాలను ప్రతివాదులుగా చేర్చుతూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం.

సీఎం జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొనడం విశేషం. ఇక కంపెనీలకు సంబంధించి జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, భారతి సిమెంట్ కార్పొరేషన్, సాగర్ సిమెంట్, ద ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, దాల్మియా సిమెంట్ లిమిటెడ్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్, మై హోమ్ ఇండస్ట్రీస్, శ్రీ జయ జ్యోతి సిమెంట్స్, భారతి పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అరబిందో ఫార్మా ఫౌండేషన్, అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జేపీ వెంచర్స్, రామ్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టర్న్ కి ఎంటర్ప్రైజెస్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, గ్రే సన్ డిష్టలరీస్, ఆదాన్ డిస్టలరీస్, సన్ రైస్ బాటిలింగ్ అండ్ బేవరేజెస్, ఎస్బిఐ ఆగ్రో ఇండస్ట్రీస్, బి 9 బేవరేజ్, సెంటినీ బయో ప్రొడక్ట్స్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థల డైరెక్టర్లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చడం ప్రాధాన్యతాంశంగా మారిపోయింది.

ఈ కేసు విషయంలో రఘురామకృష్ణంరాజు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ముంగిట వైసీపీ సర్కార్ ద్వారా ఆయాచిత లబ్ధి పొందిన సంస్థలను ప్రజల ముందు పెట్టడంతో పాటు న్యాయ పోరాటానికి దిగడం వెనుక పక్క ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో ఆధారాలు లేకుండా జగన్ సర్కార్ కేసులు నమోదు చేయడంతో పాటు చంద్రబాబును జైలుకు పంపించింది. రేపు అధికారం తారుమారైతే మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించేందుకే రఘురామకృష్ణంరాజు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అదే సమయంలో జగన్ కు సహకరిస్తున్న పారిశ్రామికవేత్తల్లో సైతం ఒక రకమైన భయం కల్పించేందుకు రఘురామ కృష్ణంరాజు ఈ ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.