Raghu Rama Krishnam Raju Survey: వైసీపీ రెబల్ ఎంపీ మరో బాంబు పేల్చారు. 2014 ఎన్నికలపై తాను సర్వే చేయించినట్టు తెలిపారు.సర్వే వివరాలను వెల్లడించారు. టీడీపీకి ఫెట్చింగ్ కనిపిస్తోందని చెప్పుకొస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే ఏకపక్ష విజయం ఖాయమని తేల్చిచెబుతున్నారు. వైసీపీ డబుల్ డిజిట్ కే పరిమితమైపోతుందని కూడా జోస్యం చెబుతున్నారు. జాతీయ స్థాయి సర్వేలను చూసి మన పార్టీ వాళ్లు మోసపోవద్దని వైసీపీ నాయకత్వానికి వ్యంగ్యోక్తులు విసిరారు.నరసాపురం లోక్ సభ స్థానానికి వైసీపీ తరుపున పోటీచేసి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. అక్కడికి ఆరు నెలల తరువాత ఆయన అధిష్టానానికి దూరమయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఆయనపై కేసులు వేయించింది. ఆ మధ్యన పెద్ద దుమారమే నడిచింది.కొద్దినెలలుగా ప్రెస్ మీట్లకే పరిమితమైన రఘురామకృష్ణంరాజు మళ్లీ డోసు పెంచారు. తాను ప్రత్యేక యాప్ ద్వారా ఏపీలో సర్వే చేయించానని.. వైసీపీ పని అయిపోయినట్టేనని తేల్చిచెప్పారు. అయితే రఘురామకృష్ణంరాజు ప్రస్తుతానికి టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు అదే టీడీపికి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇవ్వడంతో సర్వే విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది.
ఆ పాత్ర తీసుకున్నారా?
గతంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రత్యేక టీమ్ ద్వారా సర్వే జరిపిన ఆయన చాలా రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో గెలుపొందే పార్టీలు ఏవీ? ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? అన్నది సర్వేల ద్వారా వెల్లడించేవారు. వాస్తవానికి దగ్గరగా ఉండడంతో లగడపాటి సర్వేకు విశ్వసనీయత పెరిగింది. అయితే 2018లో తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు మహా కూటమి కట్టాయి.ఆ ఎన్నికల్లో మహా కూటమి గెలుపొందుతుందని లగడపాటి సర్వేలో వెల్లడించారు. కానీ అందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. మహా కూటమి దారుణంగా దెబ్బతింది. అప్పటి నుంచి లగడపాటి సర్వేలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ పాత్ర రఘురామకృష్ణంరాజు తీసుకున్నట్టుంది. రఘురామ మరో లగడపాటిగా మారబోతున్నారా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: BJP vs AAP: ఆ పత్రిక కథనంతోనే బిజెపి, ఆప్ డిష్యుం డిష్యుం
వైసీపీకి మరీ ఇంత దారుణమా?
తాను చేసిన సర్వే వివరాలను రఘురామ వెల్లడించారు. ఏయే జిల్లాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో ప్రకటించారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి కడప తప్పించి..అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని తెలిపారు. నెల్లూరు, గంటూరు, కృష్ణాలో టఫ్ ఫైట్ ఉంటుందన్నారు. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఆధిక్యత కనబరుస్తుందన్నారు. సీట్ల పరంగా చూసుకుంటే మాత్రం టీడీపీ కచ్చితంగా గెలిచే సీట్టు 54 ఉన్నాయని.. మరో 39 స్థానాల్లో ఆ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోందన్నారు. వైసీపీ కచ్చితంగా గెలిచే సీట్లు 10 ఉన్నాయని.. మరో నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తొందన్నారు. మిగతా 68 నియోజకవర్గల్లో మాత్రం హోరాహోరీ ఫైట్ నడుస్తోందని చెప్పారు. అయితే జనసేన టీడీపతో కలిసి నడిస్తే మాత్రం వార్ వన్ సైడేనని తేల్చిచెప్పారు. కచ్చితంగా కూటమి 127 స్థానాల్లో గెలుపొందుతుందన్నారు.
ఫేక్ అంటున్న అధికార పార్టీ..
దీనిపై వైసీనీ నేతలు స్పందిస్తున్నారు. అది ముమ్మాటికీ ఫేక్ సర్వేగా తేల్చుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజుకు ఏ పార్టీ నుంచి టిక్కెట్ లభించే అవకాశం లేకే ఇలా సర్వేల పేరిట కొత్త డ్రామాలకు తెరదించారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో లగడపాడి ఈ విధంగా వ్యవహరించి రాజకీయాలకు దూరమయ్యారని.. ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు అదే పరిస్థితి తప్పదని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ ప్రాపకం కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Also Read:Lepakshi Knowledge Hub Scam: ‘లేపాక్షి’ స్కాం జగన్ ను ముంచేస్తుందా?