https://oktelugu.com/

Israel vs Hamas : శవాల దిబ్బలు, కూలిన శిథిలాలు..

ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో గాజా కకావికలమవుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో.. అన్నపానీయాలకూ కొరత ప్రారంభమైంది. గాజాకు ఇజ్రాయెల్‌ విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం.. నగరంలో ఉన్న ఒకే ఒక్క విద్యుదుత్పత్తి కేంద్రంలో చమురు నిల్వలు నిండుకోవడంతో దాన్ని కూడా షట్‌డౌన్‌ చేసినట్లు పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌-- హరాకత్‌ అల్‌-ముక్వామా అల్‌-ఇస్లామియా(హమాస్‌) వర్గాలు వెల్లడించాయి.

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2023 / 07:42 PM IST
    Follow us on

    Israel vs Hamas : గత ఏడాది రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయింది. రష్యా వైపు చైనా, ఇతర దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై నాటో దేశాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు యుద్ధాలు చేసుకుంటుంటే మిగతా దేశాలు చలి కాచుకున్నాయి. రష్యా నుంచి కొన్ని దేశాలు చవకగా చమురు దిగుమతి చేసుకున్నాయి. ఉక్రెయిన్‌కు మొదట మద్దతుగా ఉన్న నాటో దేశాలు తర్వాత ప్లేటు ఫిరాయించాయి. ఫలితంగా ఈ రెండు దేశాల మీద ఆధార పడిన దేశాల్లో ఆహార కొరతతో అల్లాడటం మొదలయింది. ఆకలి చావులు నమోదయ్యాయి. ఇరు దేశాలు ఆర్థిక ఆంక్షలు, ఎగుమతుల ఆంక్షలు ఎదుర్కొంటుడం వాటి ఆర్థిక ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం పడుతోంది. ఒకవేళ యుద్ధం జరగకపోయి ఉంటే రష్యా మూడో ఆర్థిక శక్తిగా ఉండేది. ఉక్రెయిన్‌ పర్యాటకం, ఇతర రంగాల్లో నంబర్‌ వన్‌గా ఉండేది. కానీ ఒక్క యుద్ధం వాటి స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. దాన్ని మర్చిపోక ముందే ప్రస్తుతం ఇజ్రాయిల్‌- హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు జరుగుతోంది. దాడులు తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో గాజా అనే నగరం చరిత్రపుటల్లో నుంచి కనుమరుగు కావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఆహార కొరత మొదలయింది

    నాలుగు రోజుల యుద్ధంతో.. ఇజ్రాయెల్‌లోనూ ఆహార కొరత మొదలైంది. కూరగాయలు, ధాన్యం పంటలు ఎక్కువగా ఉన్న దక్షిణ ప్రాంతంలో పోరు భీకరంగా సాగుతోందని, పంట చేతికొచ్చినా.. కోతకు అవకాశాల్లేకుండా పోయాయని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఫుడ్‌చైన్‌ ఏర్పాటుకు హోల్‌సేలర్లు, రిటైలర్లకు ఆదేశాలు జారీ చేసింది. కబేళాలు, బేకరీలను నిరంతరాయంగా నడపాలని సూచించింది. కాగా, ఇజ్రాయెల్‌లో విపక్ష, అధికారపక్షాలతోకూడిన ఐక్య ప్రభుత్వం ఏర్పాటైందని.. వార్‌ క్యాబినెట్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి.

    ఒక్కొక్కటిగా వెలుగులోకి ఘాతుకాలు

    హమాస్‌ ఘాతుకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్‌ గ్రామాల్లో పౌరులు నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్న భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయని.. బుధవారం ఆ ప్రాంతాలను సందర్శించిన అంతర్జాతీయ మీడియా బృందం పేర్కొంది. గాజా, లెబనాన్‌, ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 4 వేలకుపైగా ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.

    గాజా కకావికలం

    ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో గాజా కకావికలమవుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో.. అన్నపానీయాలకూ కొరత ప్రారంభమైంది. గాజాకు ఇజ్రాయెల్‌ విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం.. నగరంలో ఉన్న ఒకేఒక్క విద్యుదుత్పత్తి కేంద్రంలో చమురు నిల్వలు నిండుకోవడంతో దాన్ని కూడా షట్‌డౌన్‌ చేసినట్లు పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌– హరాకత్‌ అల్‌-ముక్వామా అల్‌-ఇస్లామియా(హమాస్‌) వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు.. చము రు నిల్వలు అయిపోవడంతో.. గాజా వ్యాప్తంగా అంధకారమలుముకుంది. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయని.. ఔషధాల కొరత ప్రారంభమైందని ‘డాక్టర్స్‌ విత్‌ఔట్‌ బౌండరీస్‌’ పేర్కొంది. విద్యుత్తు సరఫరా లేక, అత్యవసర శస్త్రచికిత్సలు నిలిచిపోయాయని, ఆక్సిజన్‌ యంత్రాలు పనిచేయడం లేదని వెల్లడించింది. ఔషధాలు నిండుకున్న విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ వైపు నుంచి నిరంతరాయంగా రాకెట్ల దాడి జరుగుతోందని, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు లేకుండా పోయాయని గాజా వర్గాలు వాపోతున్నాయి.