
తెలంగాణలోని దళిత దిగ్గజ నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. ఆయన నోరు తెరిస్తే ప్రత్యర్థులు గజగజ వణకాల్సిందే. నాడు చంద్రబాబు ఈ మోత్కుపల్లితోనే కేసీఆర్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టించేశాడు. రాజకీయంగా కేసీఆర్ నుచాలా అవమానించారు. అయితే ఆ తర్వాత కాలంలో మోసం చేసిన చంద్రబాబుపై సైతం మోత్కుపల్లి అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.
ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిన ‘దళిత సాధికారతకు’ మెచ్చి బీజేపీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపినట్లు తెలిపారు.
తన కింత రాజకీయ అనుభవం.. చరిత్ర ఉన్నా బీజేపీ సరైన గౌరవం, స్థానం ఇవ్వలేదని మోత్కుపల్లి విమర్శలు గుప్పించారు. బీజేపీ కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.
ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకున్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా తనను అడగలేదని మోత్కుపల్లి విమర్శించారు. కేసీఆర్ దళిత సాధికారిత మీటింగ్ కు బండి సంజయ్ ను అడిగే వెళ్లానని.. అయినా తనను బ్లేమ్ చేశారని మోత్కుపల్లి అసలు నిజాన్ని బయటపెట్టారు. ఈ పరిణామాలతోనే తాను బీజేపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఇక తెలంగాణలో అసలు టీడీపీనే లేదని.. తన మిత్రులంతా టీఆర్ఎస్ లో ఉన్నారని మోత్కుపల్లి హింట్ ఇచ్చారు. దీంతో త్వరలోనే టీఆర్ఎస్ లో చేరికకు మోత్కుపల్లి రెడీ అవుతున్నట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.