Moinabad Episode- KCR: బౌండరీ కొడితే చప్పట్లు కొట్టేవాళ్లు తగ్గిపోయారు. కోహ్లీ లగాయించినట్టు గ్లాన్స్ లాంటిది పడితేనో, ఓవల్ లో అండర్సన్ ని పంత్ రివర్స్ స్వీప్ చేస్తేనో మాత్రమే కొడుతున్నారు చప్పట్లు. ఎందుకంటే ఓ మోస్తరు స్ట్రోకు సరిపోవడం లేదు. మాస్టర్ స్ట్రోక్ కావాలన్నమాట ! అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి … అదేదో వీడియో విడుదల చేసినా పెద్దగా కిక్కు రాలేదు. ఎందుకంటే అందులో ఉన్నది రేవంత్ కాదు. వచ్చిన ఆరోపణలు చంద్రబాబు మీదా కాదు ! అందుకేనేమో అలజడి లేదు. ఇంతకీ అసలు కేసీఆర్ కి గాయి గత్తర చేసే అర్హత ఉందా అనే సంగతి చూద్దాం ! రెస్పాన్స్ , చప్పట్ల సంగతి ఆ తర్వాత !

మీలో ఏ పాపం చేయని వాడే ముందుగ రాయి విసరాలి – అనే మాట ఒకటుంది. అంటే మనం శుద్ధంగా ఉన్నప్పుడే అశుద్ధాన్ని అసహ్యించొచ్చు అనమాట ! మరి కొనుగోళ్లు, అడ్డగోలు చేరికల విషయంలో టీఆర్ఎస్ – కేసీఆర్ ఏమంత పరిశుద్ధం ? 2014లో టీడీపీ తరపున గెలిచిన వారిలో 14 మందిని నంజుకున్నది ఎవరు ? తలసానిని అమాంతం మంత్రిని చేసినప్పుడు నైతికత నిద్రపోయిందా ? కాంగ్రెస్ ను వెంటాడి చెండాడినప్పుడు ఏ నిబంధనలూ అడ్డు రాలేదు ఎందుకని ? మొన్నటి 2018 తర్వాత కూడా కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్లని తెచ్చుకొని మంత్రులను చేసుకున్నావ్ కదా, అప్పుడేమైంది నిబద్ధత, నిజాయితీ ? వంద మందిని గెలిపించినా చాలదన్నట్టు టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను కబళించినప్పుడు ఈ వీరావేశం లేదుందుకో ! అడగాలంటే ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయ్.
ఇక బీజేపీ సంగతి. కేసీఆర్ ది స్టేట్ లెవెల్ బేరం అయితే… ఏకంగా రాష్ట్రాలనే టోకున కొనే బేరం బీజేపీది ! అందరికంటే పెద్ద కంపెనీ అనమాట. మధ్యప్రదేశ్ లో 27, కర్ణాటకలో 16, మహారాష్ట్రలో 47 మందిని కొని, పగలదీసి ప్రభుత్వాల్ని కూల్చిన పాతివ్రత్యం బీజేపీది. గోవా, మణిపూర్ లాంటి బాగోతాల్ని లెక్కేస్తే … అమ్ముడు పోవాలే గానీ లెట్స్ డు కుమ్ముడు అని కమలం ఎప్పుడూ సిద్ధం.
ఇప్పుడు ఇలాంటి టీఆర్ఎస్ – అలాంటి బీజేపీ మధ్య పోరు అనమాట. హాలీవుడ్ లో అయితే దీన్ని క్లాష్ ఆఫ్ టైటాన్స్ అంటారేమో ! ఇక్కడ ఇంకేదైనా పేరు పెట్టుకుందాం. మనిష్టం. ఇలాంటి కొనుగోళ్ల బేరగాళ్లు అందరూ చెప్పేది ఒకే మాట. వాళ్ల వాళ్లు అమ్ముడుపోతేనో, దెబ్బ తమకి తగులుతుంటేనో వలవలా ఏడుస్తారు. లేదంటే ప్రెస్ మీట్లు పెడతారు కేసీఆర్ లాగా ! అదే, వాళ్లు కొనుక్కున్నప్పుడు మాత్రం… ఏం మావాళ్లని కొనుక్కోలేదా ? వైఎస్ టీఆర్ఎస్ ని చీల్చలేదా ? అనే ఎదురుదాడి ఉంటుంది. బీజేపీదీ అదే కథ, యూపీయే 1 విశ్వాస పరీక్ష సమయంలో బీజేపీ వాళ్లని కాంగ్రెస్ కొనుక్కోవడం అప్పట్లో దుమారం. ఇవాల్టి పతనం బహుశా దానికి ప్రతీకారం !
అంటే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నులక మంచంలో కంతలు లెక్కపెట్టినట్టు ఉంటుంది యవ్వారం. కాంగ్రెస్ చేసిందని, వైఎస్ చేశాడని ఇపుడు టీఆర్ఎస్, బీజేపీ చేస్తామంటాయ్. జనం చూసి చూసి ఉన్నారు. లాభం ఉంటే ఓటేస్తారు. లేదంటే లైట్ తీసుకుంటారు. పట్టించుకునే పరిస్థితి లేదు.

వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు తప్పాతాలూ ఏరి మరీ 23 మందిని చంద్రబాబు చేర్చుకోవడం చూశాం ! గొట్టిపాటి లాంటి ఒకరిద్దరు తప్ప నిలబడి పనికొచ్చినోళ్లు అందులో తక్కువ. ఇప్పుడు టైమొచ్చిందని 23 మందిలో ముగ్గుర్ని వైసీపీ లాగినా గట్టిగా అడిగే నైతిక దన్ను టీడీపీకి లేదు. చేసుకున్నోడికి చేసుకున్నంత… అంటే ఇదే !
ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా, సుభాషితాలు చెప్పగలిగే సుద్ద పూసలు ఇక్కడ ఎవరూ లేరు. నేను హీరోని అని కేసీఆర్ అనుకోవడమే తప్ప.. జనం అనుకునే పరిస్థితి – విలువల కోసం రాజకీయాలు నడిచే రోజులూ కాదివి. అందుకే, మా ఎమ్మెల్యేలను కొందామని చూశారు అని కేసీఆర్ మొత్తుకోవడమే పెద్ద టైంపాస్. రేపు ఢిల్లీలో గొంతెత్తి చెప్పినా… విక్రమార్కుడు సినిమాలో గుండు స్టోరీ గుర్తొస్తుంది తప్ప లాభం లేదు. అయినా, ఆ నలుగురిలో గువ్వల తప్ప మిగతా ముగ్గురిదీ అసలు ఏ పార్టీ దొరా ? అని అడిగితే నేల చూపులు చూడాల్సిందే కదా ! ఇంకోమాట మనుగోడు ఉపఎన్నిక ఫలితానికీ ఈ అమ్మకాలు కొనుగోళ్లకి పెద్ద లింకేం ఉండదు. బీజేపీ కొనుక్కున్న వాళ్లు గతంలో గెలిచిఉండొచ్చు. ఇపుడు టీఆర్ఎస్ గెలిస్తే గెలవొచ్చేమో తెలవదు. గెలుపు ఓటములకి విలువలకీ సంబంధం ఉండదు. జనం మూడ్ ని బట్టీ గెలిచే వాడు గెలుస్తాడు. గెలిచిన వాళ్లందరికీ విలువలు ఉన్నట్టు కాదు. ఈ సంగతి దేశానికీ స్పష్టంగా తెలుసు. ఎనీ డౌట్స్.