మోడీ మళ్లీ పర్యటనల గోల.. ఈసారి ఎన్ని దేశాలో..?

ప్రధాని నరేంద్రమోడీ ఫస్ట్‌ టైమ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన విదేశీ పర్యటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దేశంలో ఉండి.. దేశ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా.. విదేశాలకు వెళ్తుండడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి మోదీ మొత్తం 58 దేశాల్లో పర్యటించారని, ఇందుకు రూ.517.82 కోట్లు ఖర్చు అయ్యాయని కేంద్రం స్వయంగా పార్లమెంట్‌లో తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం […]

Written By: Srinivas, Updated On : February 3, 2021 11:11 am
Follow us on


ప్రధాని నరేంద్రమోడీ ఫస్ట్‌ టైమ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన విదేశీ పర్యటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దేశంలో ఉండి.. దేశ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా.. విదేశాలకు వెళ్తుండడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి మోదీ మొత్తం 58 దేశాల్లో పర్యటించారని, ఇందుకు రూ.517.82 కోట్లు ఖర్చు అయ్యాయని కేంద్రం స్వయంగా పార్లమెంట్‌లో తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అమెరికా, రష్యా, చైనాల్లో ఐదుసార్లు, సింగపూర్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, శ్రీలంక, యూఏఈ వంటి దేశాల్లో పలుసార్లు పర్యటనకు వెళ్లారని వివరించారు.

Also Read: సోనియాగాంధీ ఫెయిల్ అయ్యేది అక్కడే?

ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు దేశాల్లో పర్యటించారని, చివరిసారిగా నవంబర్‌ 13,14 తేదీల్లో బ్రెజిల్‌లో పర్యటించిన మోదీ, బ్రిక్స్‌ దేశాల సమావేశంలో పాల్గొన్నారని మంత్రి చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనలతో ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాన్ని ఆయా దేశాల అవగాహనను మరింతగా పెంచేందుకు దోహదపడ్డాయని తెలిపారు. మోదీ పర్యటించిన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢమయ్యాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారం కూడా పెరిగిందని మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులతోపాటు సైబర్‌ సెక్యూరిటీ, ఉగ్రవాదం తదితర అనేక అంశాలపై ప్రపంచ స్థాయిలో ఎజెండాను రూపొందించడంలో భారతదేశం సహకారం ఎక్కువగా ఉందని చెప్పారు.

జూన్ 15, 2014 నుంచి డిసెంబరు 3, 2018 వరకు ప్రధాని విదేశీ పర్యటనకు రూ.2,000 కోట్లు ఖర్చయ్యిందని డిసెంబరు 2018లో కేంద్రం తెలిపింది. ప్రత్యేక విమానాలు, హాట్‌లైన్ సౌకర్యాలు తదితరాల కోసం ఈ మొత్తం ఖర్చయ్యిందని పేర్కొంది. ప్రత్యేక విమానాల కోసం రూ.429.25 కోట్లు, విమానాల నిర్వహణ కోసం రూ.1,583.18 కోట్లు ఖర్చయినట్టు అప్పటి విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.

2020.. యావత్ ప్రపంచానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇందుకు కరోనా కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద దేశం నుంచి పెద్ద దేశం వరకూ ఏదీ దీని ప్రభావం తప్పించుకోలేకపోయింది. అగ్రరాజ్యమైన అమెరికా వణికిపోయింది. సంపన్నతకు, నాగరికతకు ప్రతినిధులుగా చెప్పుకునే ఐరోపా దేశాలూ అనుక్షణం ఆందోళన చెందాయి. ఇప్పటికీ ఐరోపా దేశాలు భయం నీడనే బతుకుతున్నాయి. మహమ్మారి ప్రభావం భారత్ పైనా బలంగానే పడింది. సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకూ దీని ప్రభావాన్ని చవిచూశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతిని అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

ఇంకా కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోనేలేదు.. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలపై ఆసక్తి చూపుతుండడం విశేషం. ప్రధానిగా ఆయన తరచూ విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. సగటున ఏడాదికి దాదాపు 40 రోజులు మోదీ విదేశాల్లోనే ఉంటారు. ప్రపంచంలోనే కీలకమైన దేశాధినేత హోదాలో పర్యటనలు చేయడంలో తప్పేమీ లేదు. ఆయా దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం పర్యటనలు తప్పనిసరి. అయితే మోదీ విదేశీ పర్యటనలపై విమర్శలు కూడా లేకపోలేదు. విదేశాంగ మంత్రి కన్నా ఆయనే ఎక్కువసార్లు విదేశీ పర్యటనలు చేశారన్న విమర్శ బలంగా ఉంది.

తొలి దఫా (2014–-19) పదవీ కాలంలో నాటి విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ కన్నా మోదీనే ఎక్కువ సార్లు విదేశాలు సందర్శించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆరేళ్లలో మోదీ దాదాపు 226 రోజులు విదేశాల్లోనే గడిపారని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం మోదీ విదేశీ పర్యటనలపైనా పడింది. 2020లో ఆయన ఒక్క విదేశీయాత్ర చేయకపోవడం గమనార్హం. అన్ని అంతర్జాతీయ సమావేశాలకూ వర్చువల్ విధానంలోనే హాజరయ్యారు. శిఖరాగ్ర సమావేశాల్లోనూ ఆన్ లైన్‌లోనే ప్రసంగించారు. వివిధ దేశాల అధినేతలతో మాట్లాడటానికి కూడా ఈ విధానాన్నే ఎంచుకోవడం గమనార్హం.

Also Read: మోడీ ఫెయిల్ అయ్యేది.. కేసీఆర్, జగన్ లు హిట్ అయ్యింది అక్కడే?

ఇక 2020 మార్చి 17న మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు రంగం సిద్ధమయ్యారు. బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జయంతికి హాజరు కావాల్సి ఉంది. అప్పటికే కరోనా వ్యాప్తిపై వార్తలు రావడంతో బంగ్లా పర్యటన రద్దయింది. 2019 నవంబరు 13-15ల్లో బ్రెజిల్‌లో బ్రిక్స్ (బిఆర్ఐసీఎస్- బ్రెజిల్, రష్యా, ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా) కూటమి సమావేశాలకు వెళ్లడమే ఆయన ఆఖరి విదేశీ పర్యటన. ఆ తరవాత ఏ ఒక్క దేశాన్నీ సందర్శించలేదు.

మోదీ 2014 మే నెలలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 59 సార్లు విదేశాలను సందర్శించారు. పొరుగున ఉన్న భూటాన్‌తో ఆయన తొలి విదేశీ పర్యటన మొదలైంది. ఆ తర్వాత పర్యటనల వేగాన్ని పెంచారు. భారత్ పొరుగునున్న అన్ని దక్షిణాసియా దేశాలనూ సందర్శించారు. ఆఖరుకు పాకిస్థాన్‌లోనూ పర్యటించారు. 80ల్లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ తరవాత ఏ భారత ప్రధానీ పాక్‌ను సందర్శించకపోవడం ఇక్కడ గమనార్హం. మొత్తం 106 దేశాలను సందర్శించారు. ఈ పర్యటనలకు దాదాపు రూ.2,256 కోట్లు ఖర్చయినట్లు అంచనా. గత ప్రధానులు వాజ్‌పేయి, మన్మోహన్‌ల కన్నా మోదీనే అత్యధికంగా విదేశాలను చుట్టివచ్చారు. 1999 నుంచి 2004 వరకు వాజ్‌పేయి 19సార్లు విదేశాలకు వెళ్లారు. 31 దేశాల్లో తిరిగారు. 2004 మే నుంచి 2014 మే వరకు ప్రధానిగా చక్రం తిప్పిన మన్మోహన్ సింగ్ 73 సార్లు విదేశాలకు వెళ్లివచ్చారు. మొదటి అయిదేళ్లలో 35 సార్లు, రెండో దఫా పదవీకాలంలో 38 సార్లు మన్మోహన్ విదేశాల్లో విహరించారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 2021లో మోదీ మళ్లీ విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్