Modi Sarkar Another Corruption: మోటార్ సైకిళ్ళ పై మహా అయితే ఇద్దరు మనుషులు ప్రయాణించవచ్చు కూర్చున్నవారు కొద్దిగా బక్కగా ఉంటే ఇంకొకరు కూడా అది కూడా కష్టంగా ప్రయాణించవచ్చు. కానీ వాటిపై వందల టన్నుల బియ్యం తరలించడం సాధ్యమవుతుందా? మానవ మాత్రుల కైతే అస్సలు సాధ్యపడదు. కానీ మధ్యప్రదేశ్లో ఆరుగురు మిల్లర్లు 6.94 కోట్లు విలువ చేసే 1,125.64 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తరలించారు. ఏంటి.. బైకులపై అన్ని టన్నుల బియ్యం తరలించారా అని ఆశ్చర్యపోతున్నారా? మీలాగే మధ్యప్రదేశ్ ఆడిట్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఇలా తవ్వుతున్న కొద్ది మధ్యప్రదేశ్ రేషన్ స్కీమ్ లో భారీ స్కాం వెలుగు చూస్తోంది. అది కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహన్ శాఖ లోనే అడ్డగోలుగా అవినీతి జరగడం మోడీ సర్కార్ కు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

..
ఇంతకీ ఏం జరిగింది
…
మధ్యప్రదేశ్లో చిన్నారులు, గర్భిణుల కోసం ఉద్దేశించిన ఉచిత రేషన్ పథకం “టేక్ హోమ్ రేషన్” లో భారీ అవినీతి జరిగింది. కోట్ల విలువైన బియ్యాన్ని అక్రమార్కుడు బుక్ చేశారు. గత కొద్ది రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆడిటర్ జనరల్ ఈ పథకంపై లోతుగా విచారణ చేస్తున్నారు. సుమారు 36 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.,54 జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లోని 49 అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించిన ఆడిట్లో రూ. కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. మిగతా జిల్లాలోనూ అక్రమాలు జరిగి ఉంటాయని, వాటిలోనూ ఆడిట్ నిర్వహిస్తే ఈ కుంభకోణం విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పేద, బడుగు వర్గాల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 2018 లో కేంద్రం ఆయా వర్గాలకు పోషక విలువలు ఉండే రేషన్ ను ఉచితంగా అందజేయాలని ఆదేశించింది. కేంద్రం నిర్ణయంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా టేక్ హోమ్ రేషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ శాఖ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిధిలో ఉంది. నిజానికి ఈ స్కీం 2018 లో ప్రారంభమైనా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు 2021 ఫిబ్రవరి వరకు కూడా పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయలేకపోయారు. అయినప్పటికీ చాలా జిల్లాల్లో ఈ పథకాన్ని 2018 నుంచి అమలు చేస్తున్నట్లు నిధులు అడ్డగోలుగా బుక్కేశారు. మధ్యప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 9,000 మంది కిషోర బాలికలు (11 నుంచి 14 ఏళ్ళు ఉన్నవారు) బడి మానేశారని 2018 లో విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే టేక్ హోమ్ రేషన్ పథకం అమలుకు మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎలాంటి సర్వేలు చేపట్టకుండా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో 36 లక్షల మంది బాలికలు ఈ కేటగిరిలో ఉన్నట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. ఆడి టర్ జనరల్ తనిఖీలు చేసిన 8 జిల్లాలోని 49 అంగన్వాడి కేంద్రాల్లో ఈ కోవలోకి 63, 748 మంది బాలికలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక వారిలో 29,104 మందికి క్రమం తప్పకుండా పోషక విలువలతో కూడిన రేషన్ ను ఉచితంగా అందజేసినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. అయితే ఈ 49 అంగన్వాడి కేంద్రాల్లో వందల సంఖ్యలోనే కిషోర బాలికలు ఉన్నట్లు ఆడిటర్ జనరల్ నిగ్గు తెల్చారు. 2018 నుంచి 21 మధ్య కాలంలో తప్పుడు లెక్కలతో రూ. 110.83 కోట్ల విలువచేసే రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు బుక్కేశారని నిర్ధారించారు. ఇక టేక్ హోమ్ రేషన్ పథకంలో మిల్లర్ల స్థాయిలోనే భారీగా అక్రమాలు జరిగాయి. బడి, ధార్, మండ్ల, రేవ, సాగర్, శివ్ పురిలోని మిల్లర్ల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించినట్టు డబ్ల్యూ సి డి గణంకాలు చెబుతున్నాయి. యారు మిల్లులు 821 రేషన్ బియ్యాన్ని సరఫరా చేసినట్టు రికార్డుల్లో ఉంది. అయితే అంత మొత్తంలో రేషన్ ఉత్పత్తి అయితే ఆయా మిల్లుల కరెంటు బిల్లులు మాత్రం ఆ స్థాయిలో లేవని ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లతో తప్పుడు లెక్కలు వేయించి 58 కోట్ల వరకు బొక్కేశారని, అందులో ఈ ఆరు మిల్లుల వాటా 4.95 కోట్లని నిర్ధారించింది.
..
మోడీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు
..
మా పాలన అవినీతికి వ్యతిరేకం. మేమంతా శుద్ధపూసలు అని పదే పదే చెప్పే మోది మధ్యప్రదేశ్లో బియ్యం స్కాం గురించి ఏం మాట్లాడతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కుటుంబ పాలన గురించి, ఉచిత పథకాల గురించి ఈమధ్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న మోడీ.. ఉచిత పథకాల పేరుతో ఆ పార్టీ నాయకులే బియ్యాన్ని బొక్కెస్తున్నారని విమర్శిస్తున్నాయి. కాగా ఇటీవల ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కూతురు కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో అధికార టీఆర్ఎస్ డైలమాలో పడింది. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్లో బియ్యం స్కాం బయటపడటంతో బిజెపిపై టిఆర్ఎస్ నాయకులు విమర్శలు సంధిస్తున్నారు.