Modi Rojgar Mela: పుట్టిన గడ్డ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఇక మరికొన్ని రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, ఆర్థిక మాంద్యం తాలూకు ఛాయలు, పడిపోతున్న రూపాయి విలువ..ఈ పరిస్థితుల నేపథ్యంలో మోడీ పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండమే. ప్రత్యర్థి పార్టీలు.. అందులోనూ దక్షిణాది నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి, ద్రావిడ మున్నేట్ర కళగం వంటి పార్టీలు ప్రధానమంత్రి మోడీకి పలు విషయాల్లో సవాళ్లు విసురుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రాల్లో గెలవటం కేంద్ర ప్రభుత్వానికి అనివార్యం. మరీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి అత్యవసరం. ఈ క్రమంలో పార్టీకి దూరం అవుతున్న యువతను దగ్గర చేసుకోవడం కోసం ప్రధానమంత్రి మోడీ సరికొత్త నజరానా ప్రకటించారు.

ఇంతకీ ఏంటంటే
యువతకు గరిష్ట ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి మోడీ వివరించడంతో ఎన్నికల శంకరావానికి తెరతీసినట్టే కనిపిస్తోంది. ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను గణనీయంగా విస్తరించేలా తయారీ, మౌలిక కల్పన, పర్యాటకం వంటి రంగాలను ఉత్తేజితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మోడీ చెపుతున్నారు. ఇదే క్రమంలో 75 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించే రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని 30కి పైగా శాఖల కార్యాలయాల్లో వీరికి పోస్టులు కేటాయిస్తారు. అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలలో ఉద్యోగుల కల్పనకు ఎంతో చేసినా 75 ఏళ్ల అమృతకాల సందర్భంలో 75 వేల మందిని నియమిస్తున్నామని మోదీ తెలిపారు. ఇక మిగిలిన 18 నెలల కాలంలోనే 10 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పంపించిన నియామక పత్రాలను ఆయా రాష్ట్రాల్లోని కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు, బయలుదేరు ప్రత్యక్షంగా నిరుద్యోగ యువకులకు అందించారు. తమిళనాడులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లస్ 12 పూర్తి చేసుకున్న ఇంజనీర్ అభ్యర్థులకు కూడా నియమాక పత్రాలను అందించారు.. ఆన్లైన్ ద్వారా యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా ఇలాంటి రోజుగార్ మేళాలను ప్రారంభిస్తాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ పరిస్థితి ఏమీ బాగాలేదు. పలు బడా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు అనేక దేశంలో తారస్థాయికి చేరాయి అని మోడీ వివరించారు. వందేళ్లలోనే అతిపెద్ద ఉత్పాతమైన కరోనా దుష్ప్రభావాలను వంద రోజుల్లోనే అధికమించడం సాధ్యం కాదన్నారు. అయినప్పటికీ నూతన ఆవిష్కరణల ఆసరాతో దేశాన్ని కాపాడమని మోడీ తెలిపారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పదవ స్థానంలో ఉన్న భారత్ గత 8 ఏళ్లలో ఐదవ స్థానానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు కోటిన్నర మంది ఉపాధి పొందుతున్న చిన్న, ఇతర పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల విలువైన ముద్ర రుణాలను అందించడం ద్వారా కోవిడ్ సంక్షోభం నుంచి కాపాడుకున్నామని మోడీ పేర్కొన్నారు. ప్రధానంగా పరిశ్రమలపై పడుతున్న నిరుద్యోగ ఒత్తిడిని తగ్గించేందుకు వ్యవసాయం, చిన్న తరహా, మధ్యతరహ పరిశ్రమల్లో ఉపాధి, ఉపాధి అవకాశాలను పెంచాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా రోజ్ గార్ మేళా కీలక పాత్ర పోషిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.. ఇదే సమయంలో ఆయన మధ్యప్రదేశ్లోని సత్నా లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాలుగున్నర లక్షల మందికి నిర్మించిన గృహాలను గృహప్రవేశ్ కార్యక్రమం ద్వారా ఆయన ఆన్లైన్లో ప్రారంభించారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
రైల్వే తో సహా కేంద్ర ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలో గ్రూపు ఏ, బీ( గెజిటెడ్ ర్యాంక్), గ్రూప్ బి నాన్ గెజిటెడ్, గ్రూప్ సి ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాక వివిధ విభాగాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభించారు. ప్రధాని లక్ష్యానికి అనుగుణంగా కొద్ది నెలల్లో 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ విభాగాలు అపాయింట్మెంట్ లెటర్లు విడుదల చేస్తాయని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ ప్రకటించారు.
అయితే నరేంద్ర మోడీ దేశ యువతకు కల్పిస్తానన్న 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాహుల్ భారత్ జోడోయాత్ర నాలుగు రాష్ట్రాలు కూడా దాటకముందే నిరుద్యోగం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని మోడీ సర్కారు గుర్తించిందని ఎద్దేవా చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యల పట్ల బిజెపి కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీకి మోడీ పనితీరును విమర్శించే అర్హత లేదని దుయ్యబట్టింది.