
ప్రపంచంలోని అగ్రరాజ్యం అమెరికా నుంచి యూరప్, జపాన్ దాకా ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన నేత ఎవరయ్యా అంటే ఠక్కున సమాధానం చెప్పొచ్చు… మన ప్రధాని మోడీయే నని.. తాజాగా నిర్వహించిన సర్వేలో కరోనా కల్లోలంతో మోడీ రేటింగ్ కాస్త తగ్గినా కూడా ఇప్పటికీ ప్రపంచ నేతల్లో మోడీనే నంబర్ 1గా నిలవడం విశేషం.
2019 ఆగస్టులో దేశంలో కశ్మీర్ విభజన వేళ ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో దేశ ప్రజల దృష్టిలో మోడీ హీరోగా మిగిలారు. పాకిస్తాన్ తో దశాబ్ధాల వైరం గల కశ్మీర్ అంశంలో మోడీ చేసిన దానికి ప్రశంసలు కురిశాయి. ఆ సమయంలో దేశ ప్రజల్లో మోడీ ఆదరణ రేటు ఏకంగా 82శాతంగా ఉంది. నాడు కేవలం 11 శాతం మంది మాత్రమే మోడీని వ్యతిరేకించారు.
కానీ కరోనాలో మోడీ వైఫల్యం, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత, దేశంలో కరోనాతో భారీగా మరణాలు, కేంద్రప్రభుత్వ ప్యాకేజీలోపం ఇలా చాలా కారణాలు మోడీని ప్రజల దృష్టిలో విలన్ ను చేశాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ నాటికి ఆ రేటింగ్ కాస్త 66శాతానికి పడిపోయింది. 28శాతం మంది మోడీని ఈ సంవత్సరం ఎక్కువగా వ్యతిరేకించారు.
అయితే రేటింగ్ పరంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి కంటే కూడా మోడీనే ముందుండడం విశేషం. అమెరికా, యూకే, రష్యా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ సహా 13 దేశాల ప్రపంచస్థాయి నేతలకంటే కూడా మోడీనే ముందున్నారని మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ తేల్చింది.
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు కూడా అక్కడి ప్రజలు 53శాతం మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఇక అందరికంటే ఎక్కువగా 13 దేశాల్లో జపాన్ ప్రధాని యొషిహిడే సుగా రేటింగ్ కేవలం 29శాతంగా మాత్రమే ఉండడం విశేషం.