PM Modi: అసలు తెలంగాణ బిజెపికి ఏమైంది? మునుపటి ఉత్సాహం, దూకుడు కనిపించడం లేదేందుకు? ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ఇదే. నాయకత్వం మార్పిడితో తెలంగాణ బిజెపిలో నిస్తేజం అలుముకున్న మాట వాస్తవం.మొన్నటి వరకు నెంబర్ 2 లో ఉన్న బిజెపి.. తాజా సర్వేల్లో నంబర్ త్రీ కి దిగజారడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బండి సంజయ్ ని మార్చిన తర్వాత.. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా కేంద్ర మంత్రి గానే యాక్టివ్గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఈటెల రాజేందర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. బిజెపి ఈ పరిస్థితికి రావడానికి కేంద్ర నాయకత్వమే కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ వరస పెట్టి తెలంగాణలో పర్యటనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధాని మోదీ తెలంగాణ వచ్చారు. ప్రధానిగా కాకుండా ఒక అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా మాట్లాడారు. కెసిఆర్ తో పాటు కుటుంబ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. అయితే ఈ క్రమంలో కొన్ని ఆంతరంగిక విషయాలను బయట పెట్టడం విశేషం. ఇంతకుముందు ఎప్పుడూ చెప్పని ఓ రహస్యం ఈవేళ మీకు చెబుతున్నాను అంటూ కెసిఆర్ తనతో చెప్పిన విషయాలను ప్రస్తావించారు. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి నన్ను కలిశారు.” కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. తాము ఎన్డీఏలో చేరుతామని ప్రతిపాదించారు. వాటిని నేను తిరస్కరించాను. ఇది ప్రజాస్వామ్యం.. రాజరికం కాదు.. యువరాజును సీఎం చేయడానికి మీరేమైనా మహారాజా? ” అంటూ ప్రధాని స్వయంగా ప్రకటించడం విశేషం. అయితే ఈ విషయంలో ప్రధాని ఓ మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. ఓ పార్టీ నేతగా ప్రధాని మాట్లాడడంలో తప్పులేదు. కానీ ఆంతరంగిక విషయాలు చెప్పడం మాత్రం కొంచెం ఇబ్బందికరమే.
ఒకప్పుడు తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయంగా కనిపించిన బిజెపి ఇప్పుడు మూడో స్థానానికి వెళ్లిపోయిందన్నది వాస్తవం. కుమ్ములాటలను అధిగమించుకొని కాంగ్రెస్ ముందుకు పోతోంది. ఎంతో కొంత ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ సైతం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తోంది.ఏపీ సరిహద్దు, సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో బి ఆర్ ఎస్ బలహీనమవుతోంది. ఇటువంటి తరుణంలో కెసిఆర్ ను పలుచన చేయడం అంటే.. కాంగ్రెస్ బలాన్ని పెంచడమేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చేరికలతో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. బీజేపీలో ఉన్న నేతలు బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు బి ఆర్ ఎస్ బలహీనపడి.. ఇటు బిజెపి సైతం పలుచన అయితే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి లాభం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కావాల్సింది వ్యూహం. గుజరాతి బిడ్డయినా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారని.. ఇప్పుడు మరో గుజరాతి బిడ్డగా తాను తెలంగాణ పురోభివృద్ధికి కృషి చేస్తున్నానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఆనాడు నిజాం నవాబు హైదరాబాదును వదలకపోతే పటేల్ వచ్చి తరిమేశారని.. ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడానికి తాను వచ్చానని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడే అవకాశం ఉందా? ప్రధాని మోదీ సమ్మోహన శక్తిగామారుతారా? అంటే అది లేదు. ఒకరకంగా చెప్పాలంటే కెసిఆర్ ను బలహీనపరిచి బిజెపి బలపడాలి. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. కెసిఆర్ ఎంత బలహీనపడితే కాంగ్రెస్ అంతా బలోపేతం అవుతుంది. ఈ విషయం తెలియక ప్రధాని మోదీతన పాత మాటలతోనే ప్రసంగాలను కొనసాగించడం విశేషం.