నాలుగో విడత ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు మీడియా సమావేశంలో వివరించారు. ఈ ప్యాకేజీలో పలు రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దే ప్రక్రియ నిరంతరం జరుగుతోందని నిర్మల సీతారామన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బీఏఎఫ్‌ఆర్ అమలులో కేంద్ర ప్రభుత్వం చాలా ముందుందని చెప్పారు. రానున్న రోజుల్లో పోటీకి అనుగుణంగా భారత్ సన్నద్ధం కావాలన్నారు.
‘భారత్ లోని అనేక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు మోడీ సర్కార్ అద్భుతమైన సంస్కరణలు చేపట్టింది. చాలా రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయి. ఒకే దేశం-ఒకే మార్కెట్ విధానాన్ని అమలు చేస్తాం. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలకు నేరుగా నగదు అందించే విషయంలో ప్రభుత్వం ముందుందని’ నిర్మల పేర్కొన్నారు.