Modi Foreign Tour: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు విదేశాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకపక్క రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరి ఏంటని అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తున్న తరుణంలో ప్రధాని పర్యటనపై ఆసక్తి నెలకొంది.

మూడు రోజుల్లో మూడు యూరోపియన్ దేశాలైన జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు ఇక్కడ 25 సమావేశాల్లో పాల్గొంటారు. ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది నాయకులను కలుసుకుని చర్చలు జరపనున్నారు. మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు యాభై కంపెనీలకు చెందిన ప్రతినిధులను కలుసుకుని ఆహ్వానించనున్నారు. దీంతో దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు కొత్త నాంది పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరిపై అన్ని దేశాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో మోడీ విదేశీ పర్యటనపై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పర్యటనలో భారత వైఖరి స్పష్టం చేయనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మే 2న జర్మనీ చేరుకుని అక్కడే బస చేస్తారు. 3న డెన్మార్క్ వెళతారు. 4న ఇండియాకు తిరిగి రానున్నారు. అక్కడ ఉన్న భారతీయులతో ప్రధాని సమావేశమవుతారు.
Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్యాప్
డెన్మార్క్ లో కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు, వాతావరణ మార్పులు, సాంకేతికత సహకారం, ఇంధనం, భద్రత వంటి వాటిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని మధ్య చర్చలు కొనసాగుతాయని చెబుతున్నారు .మొత్తానికి ప్రధాని పర్యటన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
బెర్లిన్ లో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్మోల్జ్ తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమై దేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించనున్నట్లు చెబుతున్నారు. ప్రవాస భారతీయులతో సమావేశమై దేశంలో పారిశ్రామికీకరణ దిశగా అందించే సహాయ సహకారాల కోసం వారితో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి.. అభివృద్ధి పంచాయితీ వేళ కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా!