Chandrababu: వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్టుగా మారిందట బాబు గారి పరిస్థితి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత లాబీయింగ్ చేసినా కూడా ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కలవడానికి ముఖం చాటేశారు. ఎంతో లాబీయింగ్ ఉన్నప్పటికీ ఏపీలోని జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఆయన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగారు. అయినా ఇప్పటివరకూ వీరిద్దరూ ఆయనను కలిసేందుకు ముఖం చాటేశారని తెలిసింది. ఇప్పటికీ అపాయింట్ మెంట్ దొరకలేదట..

ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. చంద్రబాబు, అతడి టీడీపీ బృందానికి అపాయింట్ మెంట్ దక్కడానికి కొందరు పెద్దలు ఎంతో కష్టపడినా.. కలవాలని సూచించినా ప్రధాని, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఆసక్తి చూపలేదని తెలిసింది.
అమిత్ షా ప్రస్తుతం కశ్మీర్ లో ఉన్నారు. మధ్యాహ్నం నాటికి న్యూఢిల్లీకి తిరిగి వస్తాడు. కశ్మీర్ పరిస్థితిపై బ్రీఫింగ్ ఇవ్వడానికి ప్రధానిని కలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబును కలిసే అవకాశం లేదని తెలిసింది. చేసేదేం లేక టీడీపీ చీఫ్ సాయంత్రం విమానంలో హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధాని మోడీ అస్సలు బాబును కలిసే ఉద్దేశమే లేదన్నట్టుగా ఉన్నాడట..
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం మోడీ లేదా అమిత్ షాల అపాయింట్ మెంట్ కోసం తీవ్ర లాబీయింగ్ చేశారని వర్గాలు తెలిపాయి. ఎందుకంటే మోడీషాలతో రఘురామరాజుకు సత్సంబంధాలున్నాయి. వారి మద్దతు వల్లే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనపై పెట్టిన దేశద్రోహం కేసు నుంచి బయటపడగలిగారు. ఈ క్రమంలోనే రఘురామ తన పరిపతిని అంతా ఉపయోగించి చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదని సమాచారం.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని.. టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం సోమవారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏపీ డీజీపీని రీకాల్ చేయాలని కోరారు. డ్రగ్స్ మాఫియా విచారణ జరిపించాలని విన్నవించారు. తర్వాత మోడీ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా కూడా అవి నెరవేరలేదని సమాచారం.