Modi Cabinet : మోదీ 3.0 : కేంద్రంలో ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులో తెలుసా?

Modi Cabinet కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి దక్కని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. సిక్కిం, పాండిచ్చేరి, డామన్‌ డయ్యూ, అండమాన్, ఛండీగఢ్‌ ఉన్నాయి.

Written By: NARESH, Updated On : June 10, 2024 1:50 pm

Modi Cabinet

Follow us on

Modi Cabinet : కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ సర్కార్‌ కొలువుదీరింది. దేశానికి 18వ ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో దైవ సాక్షిగా హిందీలో ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మడోసారి ప్రధాని అయిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు.

71 మంది మంత్రులు..
ఇక మోదీతోపాటు 71 మందితో కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్‌రెడ్డికి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రామ్మోహన్‌నాయుడు, పెమ్మాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మకు మంత్రి పదవులు దక్కాయి. మోదీతోపాటు మొత్తం 30 మంది కేబినెట్‌ మంత్రులుగా, ఐదుగురు స్వతంత్ర హోదా మంత్రులుగా, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 9 మంది కొత్తవారికి ఛాన్స్‌ దక్కింది.

మంత్రివర్గంలో 8 మంది మహిళలు..
మోదీ 3.0 కేబినెట్‌లో 8 మంది మహిళలకు చోటు కల్పించారు. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్‌ మంత్రులుగా, మిగతా ఆరుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

బీజేపీకి 61 మంత్రి పదవులు..
ఇక కొత్త కేబినెట్‌లో మోదీతో సహా 72 మంది ప్రమాణం చేయగా, బీజేపీ నుంచి 61 మంది మంత్రులయ్యారు. టీడీపీ, జేడీయూ, ఆర్‌ఎల్‌డీ నుంచి ఇద్దరు చొప్పున ప్రమాణం చేశారు. జేడీఎస్, శివసేన, అప్నాదళ్‌ హెచ్‌ఏఎం, ఆర్పీఐ పార్టీలకు ఒక్కో పదవి ఇచ్చారు.

రాష్ట్రాల వారీగా పదవులు..
ఇక రాష్ట్రాల వారీగా పదవులు చూస్తే మోదీ 3.0 మంత్రి వర్గంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్‌కు 8, మహారాష్ట్రకు 6, మధ్యప్రదేశ్‌కు 5, రాజస్థాన్‌కు 5, గుజరాత్‌కు 4, కర్ణాటకకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 3, తమిళనాడుకు 3, హరియాణాకు 3 పదవులు కేటాయించారు. తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్, జార్ఖంఢ్, కేరళ, అసోం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు కేటాయించారు. ఇక ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాలకు ఒక్కో పదవి ఇచ్చారు.

పదవులు దక్కని రాష్ట్రాలు..
కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి దక్కని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. సిక్కిం, పాండిచ్చేరి, డామన్‌ డయ్యూ, అండమాన్, ఛండీగఢ్‌ ఉన్నాయి.