MLA Raja Singh Sensational Comments: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ నేతల్లో జోష్ పెరుగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో కాషాయ దళం సంతోషాలకు అవధులు లేకుండా పోతోంది. దేశంలోనే గుండెకాయగా పేరున్న యూపీలో అధికారం చేపట్టడం ఖాయం కావడంతో హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే ఆయన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆదిత్య నాథ్ కు ఓటు వేయకపోతే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఇప్పుడు మరోమారు అదే తీరుగా వ్యాఖ్యలు చేసి అందరిలో ఆశ్చర్యం వచ్చేలా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొనడం విశేషం. రాష్ర్టంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బుల్డోజర్లతో ఎదుర్కొనేందుకు తయారుగా ఉన్నామని చెప్పడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో బీజేపీకి ఎదురులేదని చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అధికార దాహమో విజయగర్వమో కానీ రాజాసింగ్ మాటలు అందరిలో సంశయాలు వచ్చేలా ఉండటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో బీజేపీ విజయం సాధించింది. పంజాబ్ లో మాత్రం ఆప్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. దీంతో బీజేపీ నేతల్లో పట్టరాని సంతోషం వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రాజాసింగ్ బుల్డోజర్ల గురించి మాట్లాడి వివాదాలకే తెరలేపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడాల్సింది ఆయనే గొడవలకు తెరలేపే విధంగా మాట్లాడటంతో బీజేపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సమాలోచనలు చేస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎంతో రహస్య ఒప్పందం మేరకే అక్కడ పోటీ చేయించారనే ఆరోపణలను ఎమ్మెల్యే రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎంఐఎం ఎప్పటికి తమకు మితృత్వ పార్టీ కాదని అన్నారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏ పార్టీతో ఒప్పందం కుదుర్చుకోదని తేల్చి చెప్పారు. దీనిపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని జోస్యం చెప్పారు.