YS Jagan: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డోర్స్ క్లోజ్ అయ్యాయా? ఆయన్ను పక్కకు తప్పించడం ఖాయమా? అందుకే తాను అసంతృప్తికి గురయినట్టు ఆర్కే ప్రచారం చేసుకుంటున్నారా? ఇది గ్రహించే జగన్ ఓ నాయకుడ్ని ఎంటర్ చేశారా? ఆళ్ల కుటుంబ మద్దతుతోనే గెలిపించేందుకు వ్యూహం రూపొందించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి స్థానికేతరుడు. ఆయన మంగళగిరి రాక ముందే దొందిరెడ్డి వేమారెడ్డి అనే నాయకుడు నియోజకవర్గ బాధ్యతలు చూసుకునేవాడు. వైసీపీ తరుపున చాలా రకాలుగా ఖర్చుచేశారు. ఆళ్ల ఆగమనంతో వేమారెడ్డిని పక్కనపడేశారు.
అలకా? అసంతృప్తా?
రాంకీ సంస్థ ఎండీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సోదరుడే రామక్రిష్ణారెడ్డి. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై గెలుపొందారు. చంద్రబాబు సర్కారుపై కేసులు వేయడంలో ముందంజలో ఉండేవారు. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తరువాత మంత్రి పదవి కన్ఫర్మ్ అని భావించారు. కానీ జగన్ సామాజిక సమీకరణలో భాగంగా కేబినెట్ లోకి తీసుకోలేదు. మంత్రివర్గ విస్తరణలో సైతం చాన్స్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇంట్లో జరిగిన శుభకార్యానికి సైతం జగన్ ను పిలవలేదని వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రామక్రిష్ణారెడ్డిని నమ్ముకుంటే కష్టమని భావించిన జగన్ తెరపైకి వేమారెడ్డిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
వేమారెడ్డికి లైన్ క్లీయర్
జగన్ పాదయాత్ర మంగళగిరిలో జరిగిన సమయంలో ఖర్చులన్నీ పెట్టుకున్న వేమారెడ్డి.. జగన్ గెలిచి సీఎం అయ్యాక ఎమ్మెల్సీ వస్తుందని ఆశ పెట్టుకున్నారు. కానీ లెక్కలోకి తీసుకోలేదు. పార్టీ ఫిరాయించి వచ్చిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినా వేమారెడ్డి ఫీల్ కాలేదు. ఇప్పుడు ఆర్కే.. మెల్లగా పార్టీకి దూరం జరుగుతుండటంతో జగన్ ఆయనను గుర్తించి మంగళగిరి వైసీపీకి అధ్యక్షుడిగా చేసేశారు. దంతో ఆళ్లకు షాక్ తగిలినట్లయ్యింది. కోటం రెడ్డి నుంచి నిన్నటి బాలినేని ఎపిసోడ్ వరకూ జరుగుతున్న పరిణామాలను గమనించిన జగన్ ఎక్కడికక్కడే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
సరికొత్త ప్లాన్
అయితే మంగళగిరిలో ఆళ్ల రామక్రిష్ణారెడ్డి లేకుంటే గెలుపు అసాధ్యమని తెలుసు. అందుకే వైసీపీని గెలిపించే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న.. ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డికే జగన్ ఇచ్చారు. అయోధ్యరామిరెడ్డి కి డబ్బు సమస్యే లేకుండా చేసి.. పార్టీ ని మంగళగిరిలో గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి తన సోదరుడు అయితే తట్టుకోలేడని ఆయన కూడా డిసైడయ్యారని అంటున్నారు. మొత్తంగా ఆళ్లకు జగన్ డోర్ క్లోజ్ చేసినట్టేనని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.