Agneepath Scheme: ‘అగ్నిపథ్’పై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. రెండు రోజుల కిందటే పథకాన్ని ప్రకటించిన కేంద్రం అందుకు తగ్గట్టుగా సన్నాహాలు ప్రారంభించింది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల నిమిత్తం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌తో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఇదో విప్లవాత్మక పథకం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క రక్షణ రంగ నిపుణులు, ప్రతిపక్షాలు మాత్రం అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్.. ఇది సాయుధ దళాల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని ఆరోపించింది. సైనికుల దీర్ఘకాలిక సేవలు కూడా ఈ ప్రభుత్వానికి భారమై పోయాయా..? అని విమర్శించింది. కాగా.. దేశ యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం ఇదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది స్వాగతించదగిన నిర్ణయమని అమిత్ షా నేతృత్వంలోని హోంశాఖ బుధవారం ట్వీట్ చేసింది. అగ్నిపథ్ కింద స్వల్పకాలిక ఒప్పందంపై ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లో చేరే అగ్నివీర్‌లకు.. వారి సర్వీస్ పూర్తయిన తర్వాత కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) అండ్ అసోం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇస్తామని హోంశాఖ బుధవారం ప్రకటించింది.
ఈ పథకం కింద పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న యువతను నాలుగేళ్ల స్వల్పకాలిక సర్వీస్ నిమిత్తం త్రివిధ దళాల్లోకి తీసుకుంటామని రక్షణ శాఖ మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన ఎదురైంది. రక్షణ రంగానికి చెందిన నిపుణులు.. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. నాలుగేళ్లు గడిచిన తర్వాత వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారికి సీఏపీఎఫ్ నియామకాల్లో ప్రాధాన్యమిస్తామని హోంశాఖ ప్రకటించింది. అగ్నిపథ్ ఎన్‌సీసీ క్యాడెట్లకు మంచి అవకాశాలు కల్పిస్తుందని ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ అన్నారు. ఎన్‌సీసీలో బీ, సీ సర్టిఫికెట్లున్న వారికి సాయుధ దళాల రిక్రూట్‌మెంట్‌లో ప్రత్యేక వెయిటేజీ ఉంటుందని చెప్పారు. అగ్నివీరులుగా సేవలందించిన వారికి రాష్ట్రంలో చేపట్టే పోలీస్ సంబంధిత నియామకాల్లో ప్రాధాన్యతనిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్ర పోలీసు నియామకాల్లో అగ్నివీర్‌లకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటించారు. సైనిక నియామకాల్లో ఇదో భారీ సంస్కరణ అని, సైనిక నియామకాల్లో మార్పులు తీసుకురావడమే అగ్నిపథ్ లక్ష్యమని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
Also Read:PM Modi Mission Mode: ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా? మిషన్ మోడ్ పై విపక్షాల విసుర్లు
నాలుగేళ్లు పూర్తయిన తర్వాత వారికి కార్పొరేట్, పరిశ్రమలు, సీఏపీఎఫ్, డీపీఎ్‌సయూ సెక్టార్ల సహా ఇతర రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు పొందే వీలుంటుందని చెప్పారు. ఆధునిక యుద్ధరంగం అంటే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువశ్రామిక శక్తిని కలిగి ఉండడమేనని దక్షిణ భారత ఏరియా జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్ జనరల్ అరుణ్ తెలిపారు. కాగా.. అగ్నివీరులుగా ఎంపికైన వారి కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మూడేళ్ల నైపుణ్యం ఆధారిత బ్యాచిలర్ డిగ్రీ కోర్సుని ప్రారంభించనుంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) రూపొందించిన ఈ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో అగ్నివీర్‌లకు 50 శాతం క్రెడిట్స్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇగ్నో అందించే ఈ డిగ్రీ ప్రోగ్రామ్ భారత్‌లో, విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అగ్నిపథ్ కింద పదిహేడున్నర నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు వారిని ఎంపిక చేయడం వలన వారిలో రిస్క్ చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని, తద్వారా సాయుధ బలగాల సామర్థ్యం పెరుగుతుందని సైనిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి అన్నా రు. అగ్నిపథ్ కింద జరిగే రిక్రూట్‌మెంట్‌పై రాజీపడే ప్రసక్తే లేదని ఎయిర్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్, హెడ్‌క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ సింగ్ అన్నారు.
ఆర్మీఅగ్నిపథ్ పథకం కింద త్వరలోనే 40 వేల మందిని సైనికులను నియమిస్తామని ఆర్మీ బుధవారం వెల్లడించింది. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన మర్నాడే ఈ మేరకు ప్రకటన చేసింది. ‘రాబోయే 3 నెలల్లో భారత సైన్యం 25 వేల మంది అగ్నివీర్‌లను నియమించుకుంటుంది. మిగిలిన 15 వేల మంది రిక్రూట్‌మెంట్ ఒక నెల తర్వాత మొదలవుతుంది’ అని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. అగ్నిపథ్‌లో బాగంగా మహిళలను సైతం అగ్నివీర్‌లుగా నియమిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే.. ఇది సైన్యం అవసరాలను బట్టి ఉంటుందని నేవీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ అన్నారు. త్రివిధ దళాల్లోకి మహిళా అగ్నివీర్‌లను కూడా తీసుకోవచ్చని నిబంధన ఉన్నప్పటికీ.. వారికి కేటాయించే పోస్టులపై ఇంకా శాతాన్ని నిర్ణయించలేదన్నారు.
Also Read:Konaseema: అమలాపురం అల్లర్లు.. వైసీపీ నేతలే నిందితులు.. వాళ్లు ఎవరో తెలుసా?