YS Jagan- Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని బరిలో దించేందుకు మాయావతి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి కొన్ని పార్టీలను దూరం పెట్టారన్న వార్తలు వచ్చాయి. అందులో ఏపీవో వైసీపీ ఉందని కూడా టాక్ నడిచింది. కానీ అదంతా అబద్ధమని.. లేఖ పంపినా జగన్ సర్కారు ప్రతినిధులెవరూ రాలేదని సమావేశ నిర్వహణ బాధ్యతలు చూసిన టీఎంసీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనాల్సిందిగా.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ను కూడా ఆహ్వానించినట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జగన్‌కు మమత రాసిన లేఖను బహిర్గతం చేశాయి. జగన్‌కు ఆహ్వానం పంపించినా రాలేదని టీఎంసీ నేత ఒకరు తెలిపారు. అయితే, సీబీఐకి భయపడి ఈ సమావేశానికి హాజరవ్వడానికి జగన్ నిరాకరించినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయని సీనియర్ జర్నలిస్టు పల్లవి ఘోష్ ట్వీట్ చేయడం గమనార్హం. ఇక విపక్ష శిబిరానికి తొలి నుంచీ దూరంగా ఉంటూ.. అప్పుడప్పుడూ ఎన్డీయే సర్కారుకు మద్దతు తెలుపుతున్న బీజేడీ అధినేత నవీన్‌పట్నాయక్ రాకపోవడంపై పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం కాలేదు. మోదీ సర్కారుపై నిప్పులు కురిపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్‌ఎస్ ప్రతినిధులు భేటీకి రాకపోవడం చర్చకు దారితీసింది. ఇక.. ఈ సమావేశానికి రావాల్సిందిగా తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా తాను వెళ్లేవాడిని కాదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ‘‘టీఎంసీ పార్టీ మా గురించి చెడుగా మాట్లాడుతుంది. అంతేకాదు.. ఈ భేటీకి వారు కాంగ్రె్‌సను కూడా ఆహ్వానించారు. ఆహ్వానించినా నేను వెళ్లననడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే’’ అని ఆయన తేల్చిచెప్పారు.
అయితే విపక్షాల కీలక సమావేశానికి వైసీపీ ముఖం చాటేయ్యం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ దాదాపు ఎన్డీఏ కూటమిలో చేరినట్టేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తరువాత కీలకాంశాల్లో కేంద్రంలోని ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. గత సారి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం అనుకూలంగా వ్యవహరించింది. ఎన్టీఏ అభ్యర్థులకే ఓటు వేసింది.
Also Read: Agneepath Scheme: ‘అగ్నిపథ్’పై మిశ్రమ స్పందన.. తప్పుపడుతున్న రక్షణరంగ నిపుణులు
ఈసారి మాత్రం అదే పంథాతో ముందుకెళుతోంది. జగన్ పై కేసులు ఫైనల్ స్టేజ్ కు వచ్చిన నేపథ్యంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు. అందుకే విపక్షాల విషయంలో వైసీపీ కూడాపెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అడుగు వేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. అందుకే విపక్షాల సమావేశానికి పిలవకపోతేనే మంచిదని అనుకుంది. తమనెవరూ సమావేశానికి పిలవలేదని ప్రచారం చేసుకుంది. తమపై బీజేపీ ముద్ర ఉండటం అడ్వాంటేజ్‌గా భావిస్తోంది. కానీ తాము పిలిచామని.. లేఖ పంపించామని టీఎంసీ వర్గాలు తెలిపాయి. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కల్పించడం వైసీపీకి అవసరం . అందుకే వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం అధికార వైసీపీకి కలవరపాటుకు గురిచేస్తోంది. ఆ మూడు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని భావిస్తోంది. పొత్తు చిత్తు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల రూపంలో అరుదైన అవకాశం వైసీపీకి వచ్చింది. బీజేపీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మొత్తం పరిణామాలు చూస్తూంటే వైసీపీ ఎలాంటి షరతులు లేకుండానే బీజేపీ నిలబెట్టబోయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:PM Modi Mission Mode: ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా? మిషన్ మోడ్ పై విపక్షాల విసుర్లు